మనోహరన్న మార్క్ షురూ..!
– తాండూరు అభివృద్ధికి స్పెషల్ ఫోకస్
– పదవి చేపట్టిన యాభై రోజుల్లో రూ. 100 కోట్లు
– సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క సహాకారంతో మంజూరు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన మార్క్ పాలన అందించే పనిలో నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఆత్మీయ సమ్మేళనాలు, సర్వసభ్య సమావేశాలుతో బిజీగా గడిపిన ఎమ్మెల్యే ఇక అభివృద్ధిపై దృష్టిసారించారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కలను కలిసి రూ. 100 కోట్లను మంజూరు చేయించారు. పదవి చేపట్టిన యాభై రోజుల్లోనే రూ. 100 కోట్ల నిధులు సాధించడం పట్ల నియోజకవర్గ ప్రజల్లో తన గ్రాఫ్‌ను అమాంతం పెంచుకున్నారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కలిశారు. అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో మనోహర్ రెడ్డి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గంలో పెండింగ్ పనులు, చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కల సహాకారంతో తాండూరుకు రూ.100 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్, ఎస్డీఎఫ్(స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్స్), సీఆర్ఆర్(నియోజకవర్గ గ్రామీణ రోడ్ల అభివృద్ధి) ద్వారా ఈ నిధులు మంజూరు కావడం జరిగిందని స్పష్టం చేశారు. నిధుల వినియోగంపై మంత్రి సీతక్కతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అడిగిన వెంటనే తాండూరు నియోజకవర్గానికి నిధులు కేటాయించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో త్వరలోనే పెండింగ్ లో ఉన్న పనులతో పాటు గ్రామాల్లో పంచాయతీరాజ్ రోడ్లు, పాఠశాలల భవన నిర్మాణం, మరుగుదోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణం చేపడుతామన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా కాగితాలపై జీఓలు చూపించే ప్రభుత్వం కాదని, చేతల్లో అభివృద్ధిని చేసి చూపిస్తామని అన్నారు. తాండూరు ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా పాలన అందిస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

