ఎజెండా నాట్‌ ఫేయిర్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎజెండా నాట్‌ ఫేయిర్..!
– అభివృద్ధి లేని అంశాలను రద్దు చేయాలి
– చైర్‌ పర్సన్‌ ఏకపక్ష నిర్ణయాలను సహించము
– ఎమ్మెల్యే సపోర్టు చేసినా అంగీకరించేది లేదు
– అభ్యంతరం వ్యక్తం చేసిన వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు మున్సిపల్‌లో కౌన్సిల్ ఎజెండా సొంతపార్టీలో కుంపటి పెట్టింది. మున్సిపల్ చైర్ పర్సన్‌ ఏకపంక్షగా నిర్ణయించిన అంశాలతో తయారు చేసిన ఎజెండా సక్రమంగా లేదని, వెంటనే రద్దు చేసి కొత్త ఎజెండాను ప్రవేశ పెట్టాలని వైస్ పర్సన్, కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. మంగళవారం తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం) ఆధ్వర్యంలో మీడీయా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ వైస్ చైర్మన్ ఆసిఫ్, కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ చైర్ పర్సన్ వైస్ చైర్మన్, పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం నిర్వహించకుండా ఏకపక్షంగా ఎజెండాను రూపొందించేలా చేశారని అన్నారు.

ఎజెండాలోని అంశాలు అన్ని ప్రజలకు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వకుండా రూపొందించారని అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం. తాగునీరు వంటి సమస్యలకు పరిష్కారంకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. ప్రజల ఇబ్బందులపై దృష్టి సారించలేదన్నారు. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని ఎజెండాను రూపొందించాల్సింది పోయి గ్రీన్ బడ్జెట్ కింద అవసరం లేని నిధులను ఖర్చు చేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. ఇంకా మున్సిపల్ పరిధిలోకి రాని కోకట్ గ్రామ పరిధి పార్కుకు నిధులు వెచ్చించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. రూ. 34 లక్షలు టైల్స్ కోసం ఖర్చు చేసినట్లు చూపిస్తున్న లెక్కల వివరాలను చూపించాలన్నారు. పాత ఫాగింగ్ మిషన్లు ఉన్నప్పటికి కొత్తవి కొనుగోలు చేయాల్సిన అవసరమేంటన్నారు.

అన్ని అంశాలు చైర్ పర్సన్ కు అనుకూలంగా ఉండేలా చూసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు అవినీతికి తావు ఇవ్వమని చెప్పిన తాండూరు ఎమ్మెల్యే ఇలాంటి అవినీతి ఎజెండాను అంగీకరించినా వ్యతిరేకించి తీరుతామన్నారు. నియంతలా సొంత ప్రయోజనాల కోసం ప్రవేశ పెడుతున్న ఎజెండాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధికి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ కొత్త ఎజెండాను ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, సిందూజ నరేందర్ గౌడ్, అశ్విని గుండప్ప, ముక్తార్ నాజ్, బీఆర్ఎస్: నాయకులు సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి..

సార్లు వస్తున్నారు..!