మద్యం, డబ్బు తరలిస్తే చర్యలు
– తాండూరులో మూడు చెక్ పోస్టులు
– ఎన్నికల నిబంధనలు అందరు పాటించాలి
– తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎవరైనా మద్యం, డబ్బు తరలిస్తే చర్యలు తప్పవని తాండూరు ఆర్డీఓ, సహాయ రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రావు అన్నారు. మంగళవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో రాజకీయ నాయకులు, తహసీల్దార్, పోలీసు సిబ్బందికి ఎన్నికల కోడ్ అమలుపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఎన్నికల కోడ్ ను దృష్టిలో ఉంచుకుని తాండూరులో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తాండూరు మండలం కొత్లాపూర్, బషీరాబాద్ మండలం మైల్వార్, నావందిలో చెక్ పోస్టులు కొనసాగుతాయన్నారు.
ఎవరైనా రూ.50 వేలకు మించి తరలిస్తే సంబంధిత పత్రాలు దగ్గర ఉంచుకోవాలన్నారు. అదేవిధంగా అక్రమంగా మద్యం, డబ్బులు తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల నిబంధనలు పాటించాలన్నారు. అధికార యంత్రాంగాన్ని వినియోగించుకోరాదన్నారు. అధికార పర్యటనలు, ప్రచారాలు రెండు ఒకేసారి నిర్వహించరాదన్నారు. ప్రభుత్వ వాహనాలను సొంత పనులకు వినియోగించుకోవద్దన్నారు. ప్రభుత్వ వసతి గృహాలు, సభా స్థలాలు, హెలీప్యాడ్ లు ఇతర పార్టీలకు కూడా అవకాశం ఇవ్వాలన్నారు.
టీవీలలో ప్రకటనలకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలన్నారు. శంకుస్థాపనలు, రోడ్ల నిర్మాణం, తాగునీటి వసతులకు హామీలు ఇవ్వరాదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ లావణ్య, తహసీల్దార్లు తారాసింగ్, కిషన్, వెంకటేష్, మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, ఎస్ఐలు కాశినాథ్, అశోక్, రాజకీయ పార్టీల నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

