చేతిలో ‘కారు’చిచ్చు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

చేతిలో ‘కారు’చిచ్చు..!
– హస్తంలో గులాబీ నేతల చేరికలపై అసంతృప్తి
– ఎమ్మెల్యే ముందు పార్టీ నేతల అక్కసు
– చర్చనీయాంశమైన క్యాంపు కార్యాలయంలో లొల్లి
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాజకీయాలలో నేతలు పార్టీలు మారడం సహజం. ప్రతిపక్ష పార్టీలలో చేరికలైతే వాళ్లు స్వాగతిస్తారు. అదే అధికార పార్టీలోకి ప్రతిపక్ష నేతలు వస్తే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఈ పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇదివరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డిలు హస్తం పార్టీలో చేరడంపై జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మహేందర్‌ రెడ్డి వర్గానికి చెందిన కరణం పురుషోత్తంరావు, సిద్రాల శ్రీనివాస్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో యాలాల మండలంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేశారు.

వారి చేరికపై నమ్మక ద్రోహులను పార్టీలో చేర్చుకోవడం ఏంటనీ ఆగ్రహించారు. పైగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి తెలియకుండానే పార్టీలో చేరారని మండిపడ్డారు. తాజాగా ఇదే సీన్ మళ్లీ రీపీట్ అయ్యింది. ఈ సారి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్గానికి చెందిన బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సంతోష్‌ గౌడ్, ఎంపీటీసీ ఫోరం నేత వెంకటేష్‌ చారి హస్తం గూటికి చేరుకున్నారు. చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో వారు పార్టీలో చేరారు. సంతోష్ గౌడ్ ఎమ్మేల్యే సమక్షంలో చేరినా కూడా గులాబీ నేతలు పార్టీలో చేరడం పట్ల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇదే విషయంపై శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముందు పంచాయతీ పెట్టినట్లు తెలిసింది. ఎన్నికల ముందు నేతలను, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నేతలను పార్టీలోకి ఎలా తీసుకుంటారని వాగ్వివాదం చేసుకున్నట్లు తెలిసింది. సంతోష్ గౌడ్, వెంకటేష్‌ చారి చేరికను ఒప్పుకునేది లేదని, వెంటనే వాళ్లను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. మొత్తానికి గులాబీ పార్టీ నేతలు హస్తంలో చేరడం కాంగ్రెస్‌లో పెద్ద చిచ్చు పెట్టింది. ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో వేచి చూడాలి.

ఇదికూడా చదవండి…

కూల్‌ వాటర్ ఇంత డేంజరా..!