జాతరలో రభస..!

తాండూరు రాజకీయం వికారాబాద్

జాతరలో రభస..!
– మళ్లీ హారతికి ముందు తోపులాట
– ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గీయుల వాగ్వివాదం
– భద్రేశ్వర జాతర ఉత్సవాల్లో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భద్రేశ్వర జాతర ఉత్సవాలలో రభస మళ్లీ చోటు చేసుకుంది. గత యేడాది ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిల మద్య వివాదం చెలరేగిన సంగతి అందరికి గుర్తే. అప్పడు రథోత్సవానికి హారతి ఇచ్చే సమయంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. తాజాగా శనివారం నిర్వహించిన రథోత్సవ వేడుకలలో హరతీ సీన్ మళ్లీ రిపీట్ అయ్యింది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్గీయుల మద్య పెద్ద ఎత్తున రభస చోటు చేసుకుంది.

ప్రతి యేడాది భద్రేశ్వర జాతర ఉత్సవాలలో రథోత్సవం నిర్వహిస్తారు. రథాన్ని లాగే ముందు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సారి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పూజా కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సతీమణితో కలిసి హాజరయ్యారు. అదేవిధంగా తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ తో పాటు పలువురు పట్టణ ప్రముఖులు హాజరయ్యారు. ఎమ్మెల్యే సోదరుడు, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరయ్యారు. రథోత్సవానికి హారతి సమర్పించే సమయంలో తోపులాట ప్రారంభమయ్యింది.

ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హారతి వద్దకు వెళ్లేందుకు కొంతమంది అడ్డంకిగా మారారు. అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి వచ్చే క్రమంలో కూడా అడ్డంకులు ఏర్పడ్డాయి. అటు ఇటు అడ్డంకులు ఏర్పడడంతో తోపులాట ఉద్రిక్తంగా మారింది. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు, మాజీ ఎమ్మెల్యే వర్గీయుల మద్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అక్కడే జాతర ఉత్సవాల్లో బందోబస్తులో ఉన్న డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సీఐలు, పోలీసు సిబ్బంది రంగంలోకి దిగి తోపులాటను నిలువరించడంతో వాగ్వివాదకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో రభస వాతావరణం చల్లబడింది. ప్రతి సారి జాతర ఉత్సవాల్లో రాజకీయ రభసలు చోటు చేసుకోవడం పట్ల పలువురు విమర్శిస్తూ చర్చించుకుంటున్నారు.

ఇదికూడా చదవండి…

మీతోనే ఉంటాం.. బీఆర్ఎస్ లోనే ఉంటాం..!