వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి దృష్టి
– 27 పోస్టుల దరఖాస్తులకు ఆహ్వానం
– వికారాబాద్ జిల్లా డీఎంహెచ్ఓ తుకారం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వైద్య మరియు ఆరోగ్య శాఖ వికారాబాద్ జిల్లా కార్యాలయంలో వైద్య సిబ్బంది పోస్టుల భర్తికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆ శాఖ జిల్లా అధికారి(డీఎంహెచ్ఓ) తుకారం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా శాఖలో 27 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు/ఎన్ఎఎం పోస్టుల ఖాళీలు ఉండగా వాటి భర్తీ కొరకు ఆవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. టీఎస్ నర్స్, నర్స్-మిడ్ వైఫ్, సహాయక నర్స్-మిడ్ వైఫ్, ఆరోగ్య సందర్శకుల మండలి ద్వారా నమోదు చేయబడిన అభ్యర్థులే అర్హులని వెల్లడించారు. రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ ఒకేషనల్ MPHW (F) శిక్షణ కోర్సు, ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుఫత్రులలో ఏడాది క్లినికల్ శిక్షణ, గుర్తించిన ఆసుపత్రులలో 1 సంవత్సరం అప్రెంటీస్ శిక్షణ పూర్తి చేసి ఉండాలని స్పష్టం చేశారు. దీంతో పాటు బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్ షిప్ ద్వారా అప్రెంటిస్ షిప్ కంప్లీషన్ సర్టిఫికెట్ పొంది ఉండాలని, తెలంగాణ పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా నమెదు చేసుకుని ఉండాలన్నారు. ఈనెల 20వ తేది నుంచి 22వ తేది సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయని పేర్కొన్నారు.


