కుండపోత..!
– భారీ వర్షంతో అతలకుతలం
– నదులు, వాగులకు ఉగ్రరూపం
– స్థంభించిన రాకపోకలు
– సరిహద్దుల్లో నిలిచిన రవాణా
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం దంచికొట్టింది. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం ఆదివారం కుండపోతగా మారింది. ఆకాశానికి చిల్లులు పడ్డట్లుగా గంటల కొద్ది భారీ వర్షం కురిసింది. ఎడతెరపిలేని భారీ వర్షంతో తాండూరు నియోజకవర్గంలోని గ్రామాలతో పాటు తాండూరు పట్టణంలోని పలు ప్రాంతాలు జలయమయం అయ్యాయి. తాండూరు మండలంలోని బెల్కటూర్, అల్లాపూర్, ఐనెల్లి వాగులు ఉప్పొంగి ప్రవహించాయి.
మండలంలోని పలు గ్రామాల్లోని నాపరాతి గనులు వర్షపు నీరుతో నిండుకుని వాగులు, చెరువులను తలపించాయి. యాలాల మండలంలో కోకట్ కాగ్నా, జుంటుపల్లి వాగు ఉదృతంగా ప్రవహించాయి. పెద్దేముల్ మండలంలో గాజీపూర్, బుద్దారం వాగులు కూడా పొంగి పొర్లాయి. దీంతో మార్గాల్లో రాకపోకలు స్థంభించాయి. తాండూరు మండలం సరిహద్దు కర్ణాటక నుంచి రాకపోకలు ఆగిపోయాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో రవాణా స్థంభించి పోయింది. పలు గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న పంట పొలాలు నీటమునిగిపోయాయి. పత్తి, కంది పంటలు చెరువులను తలపించాయి.
అదేవిధంగా తాండూరు పట్టణంలో గోతులతో ఉన్న రోడ్లు వర్షపునీరుతో నిండుకున్నాయి. మున్సిపల్ పరిధిలోని ఇందిరానగర్, మల్ రెడ్డిపల్లి, సాయిపూర్, ఆదర్శనగర్, పాత తాండూరు తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు వర్షపునీరుతో నిండుకున్నాయి. సాయిపూర్ లోని పలు రోడ్లు ఉప్పొంగుతున్న వాగుల్లా కనిపించాయి. మురుగుకాలువలు పొంగిపొర్లి పలువురు ఇండ్లలోకి వర్షపునీరు చేరుకుని ఇబ్బంది పడ్డారు. మరోసారి చిలుకవాగు వరదనీరుతో గ్రీన్ సీటి, మారికాంబ కాలనీ ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

ఇదికూడా చదవండి…

