బల్దియా భవనంపై కబ్జా పడగ..!
– కోట్ల ఆస్తిపై కుట్రదారుల కన్ను..?
– మున్సిపల్ పాత బిల్డింగ్‌పై రోజుకో ట్విస్టు
– పట్టణంలో ఇప్పుడు ఇదే హాట్ టాఫిక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులోని పాత మున్సిపల్ భవనం గురించే పట్టణంలో అంతా చర్చించుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా పాత మున్సిపల్ భవనం చుట్టు రాజకీయాలు కొనసాగుతున్నాయి. తాజాగా భవనంకు సంబంధించిన కీలక విషయాలు బయటకు రావడంతో కోట్ల ఆస్థిని కాజిక్కుంచుకునేందుకు పన్నాగాలు జరుగుతున్నట్లు పుకార్లు రావడం చర్చనీయాంశంగా మారింది. భవనం, స్థంలను కబ్జా చేసేందుకు పడగ విప్పి ఉందని కథనాలు కూడా రావడంతో తాండూరు వాసులకు హాట్ టాఫిక్ అయ్యింది.
50 ఏండ్లుగా పరిపాలన
తాండూరు పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయానికి విశేషమైన చరిత్ర ఉంది. 1962 నుంచి మున్సిపల్ భవనం ఏర్పాటుకు అప్పటి చైర్మన్‌లు కృషి చేయగా పాత తాండూరుకు చెందిన శెట్టి చంద్రశేఖర్ హాయాంలో శాశ్విత భవనం ఏర్పాటుకు బీజం పడింది. 1972 నుంచి ప్రస్తుతం నడి బొడ్డున భవనంలో బల్దియా కార్యాలయం ఏర్పడింది. అప్పటి నుంచి దాదాపు 50 ఏండ్ల పాటు ఈ కార్యాలయం నుంచి పరిపాలన కొనసాగించారు. తెలంగాణ ఏర్పాటు తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలో మున్సిపల్ కొత్త భవనాన్ని నిర్మించారు. గత కరోనా సమయంలో పాత కార్యాలయం నుంచి పరిపాలన కొత్త కార్యాలయానికి మారింది.
వెలుగులోకి కీలక విషయాలు
గత కొ్న్ని రోజుల క్రితం ఓ వ్యక్తి పాత మున్సిపల్ భవనానికి సంబంధించిన వివరాలు అందజేయాలని ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు అధికారులు అందించిన నివేధికలో బల్దియా భవనంపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాత మున్సిపల్ భవనానికి సంబంధించిన పత్రాలు లేవని ఓ ఆర్టీఐ దరఖాస్తులో వెలుగులోకి వచ్చింది. నిజానికి 1962-72 మద్యకాలంలో పట్టణానికి చెందిన గోవింద్ రాజ్ అనే వ్యక్తి అప్పట్లో పన్నులు బకాయి పడడంతో భవనంకు అవసరమైన స్థలాన్ని భాకీ కింద అప్పగించినట్లు తాజా సమాచారం.
కోట్ల ఆస్తికి ఎసరు..?
దాదాపు గత మూడేళ్ల నుంచి పాత మున్సిపల్ కార్యాలయం ఖాళీగా ఉంది. దీనిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా మున్సిపల్ కార్యాలయంలో ఇతర శాఖల కార్యాలయాలను ఏర్పాటు చేయాలని భావించారు. ఒక సమయంలో ప్రైవేటు లైబ్రరీ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. దీనిపై అభ్యంతరాలు రావడంతో దానిని విరమించుకున్నారు. తాజాగా పాత మున్సిపల్ కార్యాలయంలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే మున్సిపల్ పాత భవనానికి పత్రాలు లేవని వెలుగులోకి రావడంతో కోట్ల ఆస్తిని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి.
ఇదికూడా చదవండి…

