హస్తంలో కలవరం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

హస్తంలో కలవరం..!
– తాండూరులో అంతర్గత కలహాలు
– చర్చనీయాంశంగా పట్టు రాజకీయాలు
– రసవత్తరంగా మారుతున్న పరిణామాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఉత్సహాంగా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే వికారబాద్‌ జిల్లా తాండూరు ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీలో కలవరం కనిపిస్తోంది. పార్టీలో అంతర్గత కలహాలే ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. తాండూరులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చీఫ్‌ విఫ్‌ మహేందర్ రెడ్డిల మద్య కోల్డ్ పట్టు సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని తాజా పరిణాలపై రాజకీయ విశ్లేషకులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు నియోజకర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి చీఫ్‌ విప్‌ పదవిని చేపట్టారు. గతంలో మహేందర్ రెడ్డి తాండూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. ఎమ్మెల్సీగా కూడా నియోజకవర్గానికి సేవలందించారు. నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు బాస్‌లుగా ఉంటారు. ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యే ఆదేశాలను అధికారులు, పార్టీ నేతలు పాటిస్తుంటారు. ఇదే తాండూరులోని కాంగ్రెస్ పార్టీలో కలవరంకు కారణమైందని పలువురు భావిస్తున్నారు. చీఫ్‌ విఫ్‌, ఎమ్మెల్యేల మద్య పట్టు.. పెత్తన రాజకీయాలకు దారితీస్తుందని అనుకుంటున్నారు. చీఫ్‌ విప్‌గా ఎన్నికైన కొత్తలో మహేందర్ రెడ్డి తాండూరులో ఓ కార్యక్రమం ఏర్పాటు చేస్తే దానిని కావాలనే రద్దు చేయించారని పుకార్లు వినిపించాయి.

అదేవిధంగా మహేందర్ రెడ్డి వర్గానికి చెందిన కొందరు నేతలు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కార్యక్రమాలకు దూరంగా ఉండడం కలహాలకు బలం చేకూరుస్తున్నాయని అనుకుంటున్నారు. తాజాగా తాండూరు పట్టణం ఎంసీహెచ్‌ ఆసుపత్రిలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆసుపత్రిలో ఇందిరా మహిళ శక్తి కింద ఏర్పాటు చేసిన క్యాంటీన్ ప్రారంభోత్సవంలో చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి విషయంలో ప్రోటోకాల్ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేయడం విభేదాలను బహిర్గతం చేసిందని భావిస్తున్నారు. ఈ విషయంలో చీఫ్‌ విఫ్‌ వర్గీయులు మహేందర్ రెడ్డికి మద్దతుగా నిలిస్తే.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం తప్పని ఎమ్మెల్యే వర్గీయులు పెదవి విరవడం అంతర్గత కలహాలను రుజువు చేస్తున్నాయని కనిపిస్తున్న సత్యంగా తెలుస్తోంది.

మరోవైపు ఇద్దరు పెత్తన రాజకీయాల వల్ల ప్రభుత్వ అధికారులకు తలనొప్పిగా మారిన తీరును ఆయా వర్గాలలో జోరుగా చర్చించుకుంటున్నారు. ఈ పరిణామాలు ఎంత దూరం వెళతాయో.. అని రాజకీయ నాయకులు, ప్రజల్లో ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి.

ఇదికూడా చదవండి…

రేగు పళ్లు.. ఆరోగ్యానికి మేలు…!