వామ్మో.. మాయలేడి…!
– బంగారం షాపులో కమ్మలు కొట్టేసింది
– కొనేందుకు వచ్చి యజమానులకు టోకరా
– సీసీ కెమరాలతో రికార్డైన దృశ్యాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో మాయ లేడిలు రెచ్చిపోతున్నారు. బంగారం షాపులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. గత జనవరి నెలలో ఓ ఇద్దరు మహిళలు బంగారం షాపులో వెండి పట్టీలు చోరీ చేసి అడ్డంగా దొరికి పోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో యజమానులు గుర్తించి చోరీ చేసిన పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఓ మహిళ ఇదే తరహాలో బంగారం షాపులోకి వెళ్లి కమ్మలను కొట్టేసి జారుకుంది.

ఈ సంఘటన రెండు రోజుల క్రితం తాండూరు పట్టణంలో జరిగింది. బుధవారం షాపు యజమానికి వివరాలను వెల్లడించారు. పట్టణానికి చెందిన రాహుల్ అనే వ్యక్తి పట్టణంలోని నగరేశ్వర దేవాలయం వద్ద రాహుల్ జువేల్లరీ షాపు నిర్వహిస్తున్నారు. ఈనెల 3వ తేదిన వారి షాపుకు గుర్తుతెలియని మహిళ బంగారు ఆభరణాలు కొనేందుకు వచ్చింది. అందులో పనిచేస్తున్న వ్యక్తి ఆమెకు బంగారు కమ్మల ట్రే చూపించారు. వాటితో పాటు వేరే ఆభరణాలు కొనేలా హడావుడి చేస్తూ వ్యక్తిని, యజమానిని ఏమార్చి ట్రే లోని 6 గ్రాముల బంగారు కమ్మలను కొట్టేసింది.

కొద్ది సేపటి తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం షాపు యజమాని, పనిచేసే వ్యక్తి ట్రే సరిచేస్తుండగా కమ్మలు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే చుట్టు పక్కలా గమనించినా ఆ మహిళ ఆచూకీ లభించలేదు. షాపులో మహిళ చేసిన చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. చోరీకి గురైన కమ్మల విలువ రూ. 50వేల వరకు ఉంటుందని యజమాని రాహుల్ తెలిపారు. జరిగిన సంఘటనపై ఆలస్యమైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మరోవైపు షాపులో కమ్మలు దొంగలించిన మహిళ మరి కొన్ని షాపులలో కూడా నగలు కొనేందుకు వెళ్లినట్లు ఆయా షాపుల్లో సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ మాయలేడి పట్ల అందరు అప్రమత్తంగా ఉండాలని, ఆమెను గుర్తిస్తే పోలీసులకు పట్టించాలని పలువురు బంగారం షాపు నిర్వహకులు కోరుతున్నారు.
కింద వీడియోలు ఉన్నాయి…
ఇదికూడా చదవండి…

