వికాసం.. వన్పర్సన్కే…!
– కుటుంబంలో ఒక్కరికి వర్తింపు
– రూ.50 వేలలోపు యూనిట్లకు 100% సబ్సిడీ
– మిగతా యూనిట్లకు సబ్సీడీల ఖరారు
– అర్హతలు, నిబందనలు ప్ర్రకటించిన సర్కారు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రవేశపెట్టిన “రాజీవ్ యువ వికాసం” పథకం గురించి విధి విధానాలను జారీ చేసింది. దరఖాస్తు చేసుకున్న వారి కుటుంబంలో ఒక్కరికే పథకాన్ని వర్తింపజేయడం జరుగుతుందని స్పష్టం చేసింది.

ఈ పథకం విధివిధానాలను ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. తాజా సమాచారం ప్రకారం. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాల నిరుద్యోగ యువతకు జనాభా ప్రాతిపదికన యూనిట్లు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది యువతకు లబ్ధి చేకూర్చే ఈ పథకానికి రూ.6,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు.
కేటాయింపులు ఇలా…
రూ.50 వేల విలువైన యూనిట్‌కు నూరుశాతం రాయితీ ఇవ్వనుంది. రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు 80%, రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు 70% రాయితీ ఇవ్వనున్నట్లు ఉత్తర్వులో స్పష్టం చేశారు. జిల్లాలకు కేటాయించిన లక్ష్యాలను కలెక్టర్లు సంబంధిత మండలాలు, మున్సిపాలిటీల్లోని సంక్షేమ వర్గాల జనాభా మేరకు యూనిట్లు మంజూరు చేయనున్నారు. జిల్లా మంత్రి అనుమతితో కలెక్టరు అర్హుల తుది ఎంపికలు పూర్తిచేయాలని పేర్కొంది. సంక్షేమ కార్పొరేషన్లు ఆమోదించిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం లక్ష్యాలను జిల్లా కలెక్టర్లకు పంపిస్తామని ప్రభుత్వం తెలిపింది.

వ్యవసాయేతర పథకాలకు జులై 1, 2025 నాటికి 21-55 ఏళ్ల మధ్య వయసు, వ్యవసాయేతర పథకాలకు జులై 1, 2025 నాటికి 21-55 ఏళ్ల మధ్య వయసు, వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పథకాలకు 21-60 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షికాదాయం రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2లక్షలు మంజూరు చేయనున్నారు.
దరఖాస్తు విధానం ఇదే
రాజీవ్ వికాస్ పథకానికి అర్హులైన యువత తెలంగాణ ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించింది. రేషన్‌కార్డు లేకుంటే మీసేవ కేంద్రం ద్వారా జారీచేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఈబీసీ వర్గాలకు యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తును సంక్షేమశాఖలు అందుబాటులోకి తీసుకువచ్చాయి. అయితే ఓబీఎంఎంఎస్లో పూర్తిచేసిన దరఖాస్తును అర్జీదారు డౌన్లోడ్ చేసుకుని సంబంధిత పత్రాలను జతచేసి ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్ల కార్యాలయాల్లో అందజేయాలి. మండల స్థాయిలో ఎంపీడీవో, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీల ద్వారా అర్హుల ఎంపిక జరుగుతుంది.
విధివిధానాలు ఇలా..
ప్రతిష్టాత్మకంగా ఆమలు చేయబోతున్న పథకంలో వచ్చే ఐదేళ్ల వ్యవధిలో కుటుంబం నుంచి ఒక్కరికే స్వయం ఉపాధి పథకం మంజూరు చేస్తారు. ఒకేగ్రామంలో ఒకే విధమైన ఉపాధి పథకాన్ని ఇద్దరికి మంజూరు చేయరు. మొత్తం యూనిట్లలో 25శాతం మహిళలకు కేటాయిస్తారు. ఒంటరి, వితంతు మహిళలకు ప్రాధాన్యం. దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు. తెలంగాణ ఉద్యమం, ఎస్సీ వర్గీకరణ పోరాటంలో పాల్గొన్న కుటుంబాల వారికి, స్వయం ఉపాధిలో నైపుణ్యాలు ఉన్నవారికి ప్రాధాన్యం. అసహాయ వర్గాలకు రూ.లక్ష వరకు నూరుశాతం రాయితీతో యూనిట్లు మంజూరవుతాయి. సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టులకు నూరుశాతం రాయితీ వర్తిస్తుంది.

ఎంపికైనవారికి వారం నుంచి 15 రోజుల వరకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తారు. అనంతరం యూనిట్లు మంజూరు చేసి, అవసరమైన సహాయం చేస్తారు. యూనిట్ గ్రౌండ్ చేసిన తరువాత ఆరునెలల నుంచి ఏడాది వరకు నిపుణులతో సాంకేతిక శిక్షణ, సహాయాన్ని అందిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 5. అనంతరం 6 నుంచి 20 వరకు మండలస్థాయి కమిటీలు అర్హుల ఎంపికలు పూర్తిచేసి జిల్లాస్థాయి కమిటీలకు జాబితాను అందజేస్తాయి. జిల్లా స్థాయి కమిటీ ఈ జాబితాలను పరిశీలించి మే 21 నుంచి 31 వరకు మంజూరు చేస్తుంది. జూన్ 2 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు జారీ అవుతాయి.
ఇదికూడా చదవండి…

