అంగన్వాడీ హెల్పర్లకు గుడ్‌ న్యూస్..!

తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

అంగన్వాడీ హెల్పర్లకు గుడ్‌ న్యూస్..!
– ఇక ఆయాలకు టీచర్లుగా ప్రమోషన్
– ఫైల్‌పై సంతకం చేసిన మంత్రి సీతక్క
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలోని అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కూడా ముందడుగు వేసింది. ఇందులో భాగంగా తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అంగన్వాడీ హెల్పర్లకు అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ పొందేందుకు అవకాశం కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. దీనికి సంబంధించిన ఫైల్‌పై మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క సంతకం చేశారు. ఈ మార్పు వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4,322 మంది అంగన్వాడీ హెల్పర్లు.. టీచర్లుగా ప్రమోషన్ పొందే అవకాశం లభిస్తుంది.

వయోపరిమితి కారణంగా అనేకమంది అర్హులైన హెల్పర్లు పదోన్నతి అవకాశాలను కోల్పోవడంతో, వారు తీవ్ర నిరాశ చెందుతున్నారు. అయితే, ఈ తాజా నిర్ణయం వారికి మళ్లీ ఆశలు రేకెత్తించింది. ఈ నిర్ణయం వల్ల 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల హెల్పర్లు ఇప్పుడు టీచర్ పదవులకు అర్హులవుతారు, అందులో 50 ఏళ్ల లోపు అర్హతలు కలిగిన హెల్పర్లకు పదోన్నతి ఇవ్వడంలో ఎలాంటి అడ్డంకులూ లేవని స్పష్టం చేశారు. ఈ నివేదిక ఆధారంగా మంత్రి సీతక్క ఫైల్‌పై సంతకం చేసి, ఈ నిర్ణయాన్ని ఆమోదించారు.

ఇటీవల అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 65 ఏళ్లకు పెంచారు. ఈ పరిస్థితుల్లో తాజా నిర్ణయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంలో, 50 ఏళ్ల వయస్సులో టీచర్‌గా ప్రమోషన్ పొందే హెల్పర్లు మరో 15 సంవత్సరాల పాటు విధులు నిర్వహించే అవకాశం పొందుతారు. ఇది వారి ఉద్యోగ భద్రతను, స్థిరత్వాన్ని మరింత పెంచుతుందని అధికారులు సూచించారు. ఈ నిర్ణయాన్ని అంగన్వాడీ హెల్పర్లు హర్షించారు.

తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయంతో అంగన్వాడీ హెల్పర్లకు కేవలం పదోన్నతి అవకాశాలను మాత్రమే కల్పించలేదు, ఈ చర్య మహిళా, శిశు సంక్షేమ శాఖ నిబద్ధతను ప్రతిబింబిస్తూ, అంగన్వాడీ కార్మికులకు మరింత మెరుగైన భవిష్యత్తును అందిస్తోంది. త్వరలో ఈ నిర్ణయానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి.

ఇదికూడా చదవండి…

మైనర్ల డ్రైవింగ్‌పై కొరడా..!