కాగ్నానది బ్రిడ్జిపై డేంజర్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కాగ్నానది బ్రిడ్జిపై డేంజర్..!
– బ్రిడ్జి మద్యలో భారీ రంద్రం
– రెండేళ్లకే బయటపడిన నిర్లక్ష్యం
– ఆగ్రహం వ్యక్తం చేసిన బీఎస్ఆర్
– నిరసన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు – కోడంగల్ మార్గంలోని కాగ్నానది బ్రిడ్జి డేంజర్ జోన్లోకి వెళ్లింది. నిర్మించిన రెండేళ్లకే పనుల నిర్లక్ష్యం బయటపడింది. కాగ్నానది బ్రిడ్జిపై భారీ రంద్రం ఏర్పడడంతో సర్వత్రా ఆందోళనకు గురిచేసింది. నది రోడ్డు మద్యలో భారీ రంద్రం ఏర్పడిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. తాండూరు – కోడంగల్ రోడ్డు మార్గంలో కాగ్ననదిపై శిధిలావస్థకు చేరడంతో కొత్త వంతెన నిర్మాణంను చేపట్టారు. రూ. 16 కోట్లతో కొత్త వంతెన నిర్మించారు.

రెండేళ్లుగా కొత్త బ్రిడ్జిపై నుంచి తాండూరు, కోడంగల్తో పాటు మహబూబ్ నగర్, కర్ణాటక, మహరాష్ట్ర మార్గాలకు రవాణా సౌకర్యం అందుతోంది. అయితే కొత్త బ్రిడ్జిపై భారీ రంద్రం ఏర్పడడం భయాందోళనకు గురిచేస్తోంది. శనివారం రాత్రి పలువురు ప్రయాణికులు బ్రిడ్జిపై ఏర్పడిన రంద్రాన్ని గుర్తించారు. ఆదివారం కూడా పరిశీలించడంతో కాగ్నా నది బ్రిడ్జి డేంజర్ లో పడిందని గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు కాగ్నానది బ్రిడ్జిని పరిశీలించారు.

గత పాలకుల నిర్లక్ష్యం : కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి
కాగ్నానది బ్రిడ్జిపై భారీ రంద్రంను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పనులు నాసిరకంగా చేపట్టారని విమర్శించారు. కమీషన్ల కోసం బ్రిడ్జి నిర్మాణం నాసిరకంగా చేపట్టి ప్రజల ప్రాణాలను ముప్పులోకి నెట్టారని మండిపడ్డారు.

బ్రిడ్జి నిర్మాణ సమయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ప్రజా ధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. కాగ్నానది బిడ్జితో పాటు తాండూరు- గాజీపూర్ బ్రిడ్జి పరిస్థితి కూడా ఇలాగే తయారయ్యిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అవినీతి పనులు చేపటిన బాధ్యులను గుర్తించి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, ఉపాధ్యాయ నాయకులు నర్సిరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, యువనాయకులు వికాస్ జోషి. బాతుల నగేష్ తదితరులు ఉన్నారు.

పరిశీలించిన బీజేపీ నాయకులు
కాగ్నానది కొత్త బ్రిడ్జిని బీజేపీ నాయకులు పరిశీలించారు. బీజేపీ జిల్లా ఎన్నికల కన్వినర్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, జిల్లా నాయకులు పటేల్ విజయ్ కుమార్, సుదర్శన్ గౌడ్లు, అదేవిధంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం తదితరులు వేరు వేరుగా పరిశీలించారు.

కాగ్నానది బ్రిడ్జిపై భారీ రంద్రం ఏర్పడడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం చెట్టు కొమ్ములు పెట్టి నిరసన వ్యక్తం చేశారు.

బ్రిడ్జిపై రక్షణ చర్యలు
మరోవైపు కాగ్నానదిపై ఏర్పడిన రంద్రం నుంచి రక్షణ చర్యలు చేపట్టారు. పోలీసు, సంబంధిత శాఖ అధికారులు ఆధ్వర్యంలో రంద్రం ఏర్పడిన ప్రాంతం వద్ద బారీ కేడ్లను ఏర్పాటు చేశారు. రంద్రం సమీపం నుంచి భారీ వాహనాలు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఈ ప్రమాద కర పరిస్థితి నుంచి రక్షణ చర్యలు చేపట్టేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఇదికూడా చదవండి..

కేవీసీఎస్‌లో ఉప్పొంగిన దేశభక్తి…!