పాతకుంటలో.. ఫైట్..!
– ప్రైవేటు భూమిలో తవ్వకాలు
– మున్సిపల్ సిబ్బంది కాపలాపై డౌట్
– సీరియస్‌గా హైకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన
– చొరబాటుపై పోలీసులకు విజయాదేవి ఫిర్యాదు
– చర్చనీయాంశంగా చిలుకవాగు పంచాయతీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని పాతకుంట పంచాయతీ రోజు రోజుకు ఉత్కంఠతకు గురిచేస్తోంది. ఆదర్శనగర్‌లో నుంచి వెళ్లే చిలుక వాగు డ్రైన్ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీలో యుద్దం జరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, రిటైర్డ్ ఉద్యోగులు విజయాదేవి, రంగారావులకు చెందిన స్థలం విషయంలో వివాదాలు ముదిరి పోతున్నాయి. వారి స్థలంలో ప్రవేటు వ్యక్తులు చొరబడి తవ్వకాలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణంలో గత కొన్ని రోజులుగా చిలుక వాగు డ్రైన్ విషయంలో ఆదర్శనగర్‌లోని వినాయక కన్వెన్షన్ హాల్ వద్ద వివాదం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలోని సర్వేనెంబర్ 95, 96యూ, 69యూయూ, 97/ఏ, 106ఎల్‌యూ, 107/యూఆర్‌లోని స్థలంలో భూమిపై విజయాదేవి హైకోర్టును ఆశ్రయించారు.

కొన్ని రోజుల క్రితం ఈ స్థలంలో నుంచే చిలుక వాగు డ్రైన్ వెళుతుందని మున్సిపల్ అధికారులు డ్రైన్ తవ్వకాలు చేపట్టారు. దీంతో విజయాదేవి మా సొంత స్థలంలో తవ్వకాలు చేపట్టారని హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు అట్టి స్థలం జోలికి వెళ్లవద్దని మున్సిపల్‌తో పాటు పలు శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.
అర్దరాత్రి తవ్వకాలు
ఇదిలా ఉండగా శనివారం రాత్రి విజయాదేవికి చెందిన స్థలంలో కొందరు వ్యక్తులు ప్రైవేటు జేసీబీతో తవ్వకాలు చేపట్టడం వివాదాస్పదంగా మారింది. విషయం తెలుసుకున్న విజయాదేవి సంఘటనా స్థలానికి చేరుకుని అడ్డుకున్నా ఫలితంలేకపోయింది. దీంతో ఆమె తాండూరు పట్టణ పోలీసులకు హైకోర్టు ఉత్తర్వులను భేఖాతారు చేశారని ఫిర్యాదు చేశారు. అయితే ఈ స్థలంలో మున్సిపల్ అధికారులే తవ్వకాలు చేపట్టారని ఆమె ఫిర్యాదులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు తవ్వకాలు చేపట్టిన స్థలంలో ఆదివారం మున్సిపల్ సిబ్బందిని కాపలాగా ఉంచడం గమనార్హం.

విజయాదేవి వర్సెస్ మున్సిపల్
మరోవైపు ఆదర్శనగర్‌లోని చిలుక డ్రైన్ విషయంలో నువ్వా.. నేనా.. అనే విధంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చిలుక వాగు డ్రైన్ పనులను అడ్డుకుంటున్నారని మున్సిపల్ అధికారులు పేర్కొంటుండగా.. సొంత స్థలంలో నుంచి డ్రైన్ ఎలా కడతారని విజయాదేవి ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా విజయాదేవి, రంగారావులకు చెందిన కాలేజీ భవనాన్ని అక్రమంగా నిర్మించారని నోటీసులు జారీ చేయడంతో నువ్వా.. నేనా అనే స్థాయికి పరిణామాలు వెళ్లినట్లు కనిపిస్తోంది. ఈ సంఘటన అధికార కాంగ్రెస్ పార్టీలో పాటు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. రోజు రోజుకు ఏం జరుగుతుందో అని ఉత్కంఠతను రేపుతోంది.

ఇదికూడా చదవండి…

