ముసాయిదా చర్చ.. రసా భసా..!
– వార్డుల హద్దుల దాటిన ఓటర్ల నమోదు పట్ల ఆగ్రహం
– మున్సిపల్ అధికారులను నిలదీసిన పార్టీల నేతలు
– అభ్యంతరాలను పరిష్కరించాలని ఫిర్యాదులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జాబితాపై నిర్వహించిన సమావేశం రసాభసాగా కొనసాగింది. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ యాదగిరి ఆధ్వర్యంలో ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించేందుకు సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, టీజేఎస్, ఎంఐఎం, డబ్ల్యూపీఐ, బీఎస్పీ, సీపీఐ తదితర పార్టీల నేతలతో పాటు మాజీ కౌన్సిలర్లు, నాయకులు హాజరయ్యారు. సమావేశంలో మాజీ ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ వైస్ చైర్మన్ అసిఫ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ ఫ్లోర్ లీడర్ సోమ శేఖర్, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, సాహు శ్రీలత, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ చారి, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం, ఎంఐఎం నాయకులు హాది, సీపీఐ నాయకురాలు విజయలక్ష్మి పండిత్, బీజేపీ నాయకులు నాగారం మల్లేశం, బంటారం భద్రేశ్వర్, రజనీకాంత్ తదితరులు ముసాయిదా జాబితా రూపకల్పనపై అభ్యంతరాలు తెలిపారు. ఒక వార్డులో ఉన్న ఓటర్లను ఇతర వార్డులో చేర్చడం, ఒకే వార్డులో మూడు వార్డులకు చెందిన ఓట్లర్లను చేర్చడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

వార్డుల హద్దులు దాటి ఓటర్లను చేర్చడం ఏంటని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లను చేర్చారని, వందల కొద్ది బోగస్ ఓటర్లను చేర్చడం పట్ల మండిపడ్డారు. ఒక్కో వార్డులో చనిపోయిన వారి ఓటర్లను తొలగించకపోవడంతో పాటు పట్టణానికి సంబంధం లేని గ్రామాలు, తాండాలకు చెందిన ఓటర్లు ముసాయిదా జాబితాలోకి ఎలా వచ్చారని ప్రశ్నించారు. గతంలో జరిగిన ఎన్నికలలో పాటించిన విధానాలు ఎందుకు పాటించలేదని నిలదీశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రాలలో ఓటర్లను ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. గతంలో ఉన్న విధంగా ఏ వార్డులకు చెందిన ఓటర్లను అదే వార్డులో ఉండేలా ఓటరు జాబితాను రూపొందించాలని డిమాండ్ చేశారు. అనంతరం పార్టీల వారిగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వార్డుల వారిగా ఓటర్లను ఉంచాలని, చనిపోయిన ఓటర్లను, డబుల్ డబుల్ ఉన్న ఓటర్లను తొలగించాలని అభ్యంతరాలను తెలుపుతూ ఫిర్యాదులు చేశారు.

అభ్యంతరాల పరిష్కారానికి చర్యలు : కమీషనర్ యాదగిరి
అఖిలపక్ష పార్టీలతో జరిగిన సమావేశంలో నాయకులు అందించిన అభ్యంతరాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమీషనర్ యాదగిరి తెలిపారు. ఈనెల 8వ తేది వరకు అభ్యంతరాలకు గడువు ఉంటుందని స్పష్టం చేశారు. నేతలు అందించిన ఫిర్యాదులతో పాటు గడువులోగా వచ్చే అభ్యంతరాలను స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో వార్డుల వారిగా అధిక ఓటర్లు, తక్కువ ఓట్లు, ఒకే ఇంటిపై పదుల సంఖ్యలో ఓటర్లు ఉన్నారనే ఫిర్యాదులు అందాయని తెలిపారు. వీటన్నింటిని పరిష్కరించిన తరువాత తుది జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, మాజీ కౌన్సిలర్లు, మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ మణిపాల్, టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

