ఏం.. ట్విస్ట్ ఇచ్చావ్.. శివయ్యా..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఏం.. ట్విస్ట్ ఇచ్చావ్.. శివయ్యా..!
– ఇంట్లో దాచిన డబ్బులు దోచుకెళ్లారని లబో దిబో
– పరుగెత్తి పట్టుకొచ్చిన పోలీసులు
– సీన్ కట్‌ చేస్తే.. ఖంగుతిన్న ఖాకీలు
– యాలాలలో ఇంట్రెస్టింగ్ చోరీ.. స్టోరీ
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : సార్.. మా ఇంట్లోకి దొంగలు చొరబడి దాచుకున్న లక్షలు ఎత్తుకెళ్లారని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. పేద వ్యక్తి దాచుకున్న లక్షలు పోగొట్టుకున్నారని పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసారు. గంటల్లోనే అనుమానితులను గుర్తించి పట్టుకొచ్చారు. సీన్‌ కట్ చేస్తే డబ్బులు పోయాయని ఫిర్యాదు చేసిన వ్యక్తి అందరు ఖంగుతినే విధంగా షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు.
kvcs
డబ్బులు ఎక్కడికి పోలేదని, దాచిన చోటే భద్రంగా దొరికాయని ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలో కలకలం రేపింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాలాల మండలం అచ్యుతాపూర్ గ్రామంలో శుక్రవారం గొల్ల శివయ్య ఇంటికి తాళం వేసి వ్యవసాయ పొలానికి వెళ్లాడు. కొద్ది సేపటి తరువాత శివయ్య ఇంటికి కొందరు వ్యక్తులు వచ్చి వెళ్లడాన్ని కొడుకు శ్రీనివాస్ గమనించాడు. వెంటనే వారిని వివరాలు ఆరా తీయగా ఊళ్లోకి పందులు పట్టేందుకు వచ్చామని తెలిపారు.

అనుమానం వచ్చి శివయ్య కొడుకు ఇంటిని పరిశీలించగా ఇంటికి తాళం లేకుండా ఉండడాన్ని గమనించి వెంటనే తండ్రి శివయ్యకు ఫోన్‌ చేశాడు. ఇంటికి తాళం వేసే వచ్చానని స్పష్టంగా కొడుకుతో తెలిపాడు. ఆందోళన చెందిన శ్రీనివాస్ ఇంట్లో డబ్బులు దాచావా.. అని మళ్లీ ప్రశ్నించాడు. ఇందుకు అవునని చెప్పడంతో శ్రీనివాస్ ఇంట్లో దొంగతనం జరిగిందని అనుమానించాడు. అప్పటికే పందులు పట్టేందుకు వచ్చామని చెప్పిన వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న తండ్రి శివయ్య ఇంటికి వచ్చిన డబ్బుల కోసం వెతికాడు. ఇనుప పెట్టేలో డబ్బులు కనిపించకపోవడంతో అయోమయానికి గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న తాండూరు రూరల్ సీఐ నగేష్ గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు.

గ్రామంలోకి వచ్చిన పందుల పట్టే వారిపై నిఘా పెంచగా వాళ్లు వచ్చిన బైకు వివరాల ఆధారంగా పరిగి లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పరిగి పోలీసుల సహకారంతో పందులు పట్టే వారిని అదుపులో తీసుకున్నారు. పోలీసులు జరిగిన సంఘటనపై నిలదీయగా నిజంగా పందులు పట్టేవారమని, దొంగతనం చేయలేదని స్పష్టంగా చెప్పారు. దీంతో శివయ్యను పోలీసులు కలిసి అతని ఇంట్లో క్షుణ్ణంగా పరిశీలించారు. ఈక్రమంలో ఇంట్లో ఉన్న పెట్టెల పక్కనే ఉన్న ఒక రాతి గోలెంలో దాచి పెట్టిన రూ. 2 లక్షల 90 వేలు నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ సంఘటనతో శివయ్యతో పాటు పోలీసులు కూడా అవక్కయ్యారు. కాగా శివయ్య మతిమరుపుతో తప్పుడు సమాచారం అందించానని చెప్పారు. దీంతో పోలీసులు, గ్రామస్తులు శివయ్య ఇచ్చిన ట్విస్టుకు షాక్ అయ్యారు. గ్రామంలో ఎలాంటి చోరి జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఇదికూడా చదవండి…

నెహ్రు గంజ్‌లో శ్రావణ శోభ..!