అక్షర సైంటిస్టులు భళా..!
– విజ్ఞాన్ వైభవ్ 2.0లో మెరిసిన తాండూరు విద్యార్థులు
– జాతీయ స్థాయిలో ప్రత్యేక ప్రతిభ పురస్కారం
– ఇస్రో వ్యోమగామి శుభాంషు శుక్లా ప్రశంసలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని అక్షర హై స్కూల్ బాల సైంటిస్టులు భళా అనిపించారు. జాతీయ విజ్ఞాన దినోత్సవం – 2026 సందర్భంగా కైట్ ఫౌండేషన్(కలాం’స్ ఇన్సిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సెలెన్స్) ఆధ్వర్యంలో భారతదేశంలోని ప్రముఖ శాస్త్రీయ సంస్థలు అయిన ఇస్రో, డీఆర్డీఓ, ఏఈఎస్ఐ, టీ-వర్క్స్ సంయుక్తంగా విజ్ఞాన్ వైభవ్ 2.0 – ఇండియన్ లెవల్ సైన్స్ ప్రాజెక్ట్ ఎక్స్పో కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో సైన్స్ ప్రదర్శన ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇస్రో వ్యోమగామి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంను సందర్శించిన తొలి భారతీయుడు శుభాంశు శుక్లా, డీఆర్డీఓ మాజీ చైర్మన్ డా. జి. సతీష్ రెడ్డిలు హాజరయ్యారు. వారి సమక్షంలో వికార్బాద్ జిల్లా తరఫున తాండూరు అక్షర హై స్కూల్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థినులు ఆదితి, సంజనా వైష్ణవ్‌లు మొబైల్ మైక్రోస్కోప్ అనే అంశంపై వినూత్న శాస్త్రీయ ప్రాజెక్టును ప్రదర్శించారు. తక్కువ ఖర్చుతో, సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో సూక్ష్మజీవులను పరిశీలించగలిగే విధంగా రూపొందించిన ఈ ప్రాజెక్ట్ న్యాయనిర్ణేతల ప్రశంసలను అందుకుంది.

ఈ సందర్భంగా ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ప్రస్తుత డైరెక్టర్, స్పేస్ సైంటిస్ట్ డా . ప్రకాష్ చౌహాన్ ప్రత్యేక పురస్కారం ప్రదానం చేశారు . దేశ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలో ప్రత్యేక అవార్డు అందుకోవడం తాండూరు పట్టణానికి, వికార్బాద్ జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా అక్షర హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మోహన్ కృష్ణ గౌడ్ మాట్లాడుతూ తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం మా పాఠశాలకు గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో మరింత పెద్ద వేదికలపై అక్షర విద్యార్థులు ప్రతిభ చాటుతారని ఆశిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టు మార్గదర్శకులు రవి కుమార్, శ్రీకాంత్ కులకర్ణిలను పలువురు అభినందించారు. పాఠశాల యాజమాన్యం ప్రవీణ్, యూనుస్, రవీందర్, శోభరణి, ఉపాధ్యాయులు కూడా హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.


