క్యాన్సర్‌ అంటే భయం వద్దు

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

క్యాన్సర్‌ అంటే భయం వద్దు
– ముందస్తుగా గుర్తిస్తే నయం చేసుకోవచ్చు
– తాండూరు డీఎస్పీ నర్సింగ్‌ యాదయ్య
– కిమ్స్ ఆసుపత్రి వైద్యులు డా.మధు దేవర శెట్టి
– తాండూరులో వైద్య శిబిరంకు అనూహ్య స్పందన
– 350 మందికి పైగా తరలివచ్చిన ప్రజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : క్యాన్సర్ వ్యాధి అంటే భయపడాల్సిన పనిలేదని, ముందస్తుగా గుర్తిస్తే ప్రాణాలను కాపావడుకోవచ్చని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి క్యాన్సర్ వైద్యులు డా.మధు దేవర శెట్టిలు అన్నారు.

ఆదివారం తాండూరు పట్టణం సాయితరుణ్ ఆసుపత్రిలో ఐఎంఏ అధ్యక్షులు డా. జయప్రసాద్ ఆధ్వర్యంలో ఐఎంఏ, కిమ్స్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై వైద్యులతో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. క్యాన్సర్ వైద్య శిబిరాన్ని దృష్టిలో ఉంచుకుని సుమారు 14 మంది వైద్యులు సేవలు అందించారు. ఈ శిబిరానికి తాండూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి సుమారు 350 మందికి పైగా తరలివచ్చి వివిధ పరీక్షలు చేయించుకున్నారు.

150 మందికి పైగా రక్తపరీక్షలు, 63 మంది అల్ట్రా సౌండ్‌ స్కానింగ్, 12 మంది మోమోగ్రఫీ, 8 మంది ఎండోస్కోపింగ్, 69 మంది ఎక్స్‌రే, 63 మంది క్యాన్సర్ పరీక్షలు, 53 మంది పాప్‌ స్మియర్ పరీక్షలు, మిగతా వారు ఇతర పరీక్షలు చేయించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శిబిరం కొనసాగింది. ఈ సందర్భంగా కిమ్స్ ఆసుపత్రి వైద్యులు డా.మధు దేవర శెట్టి మాట్లాడుతూ ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్లతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. దురాలవాట్లను దూరం చేసుకుంటే క్యాన్సర్‌ను దూరంగా ఉంచవచ్చని అన్నారు. ముందస్తు పరీక్షలు చేయించుకోవడం వల్ల క్యాన్సర్‌ వ్యాధిని నయం చేయవచ్చని అన్నారు.

అదేవిధంగా డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో క్యాన్సర్‌ వ్యాధి అంటే భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. సకాలంలో పరీక్షలు, వైద్యం చేయించుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు. ఐఎంఏ, కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రి వైద్యులు, తాండూరు ఐఎంఏ ప్రతినిధులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పాఠకులకు మెరుగైన సేవలు