శ్రీశైల్ రెడ్డికి గులాబీ పగ్గాలు..!
– తాండూరు బీఆర్ఎస్ ఇంఛార్జిగా నియామకం
– బోగస్ ఓట్ల తొలగింపుకు దిశానిర్దేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఆ పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి, సీనీయర్ నాయకులు పంజుగుల శ్రీశైల్ రెడ్డి చేపట్టారు.

బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజకవర్గ ఇంచార్జిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా శనివారం తాండూరులోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో జరిగిన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో శ్రీశైల్ రెడ్డి ఈ విషయం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా చూడాలని పార్టీ నేతలకు సూచించారు. బోగస్ ఓట్ల తొలగింపు సజావుగా జరగడానికి, ఈ ప్రక్రియలో అధికార పార్టీ అక్రమాలు అడ్డుకోవడానికి నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్ బూత్‌కూ ఒక్కొక్క బూత్ లెవెల్ ఏజెంట్ (బీఎల్‌ఏ)ను నియమించుకోవాలని పట్టణ, మండల అధ్యక్షులకు, ముఖ్య నాయకులకు సూచించారు. రెండు రోజులలో ఈ ప్రక్రియ పూర్తి చేసి, ఆ వివరాలను సంబంధిత ఎమ్మార్వోలకు, ఈఆర్వోగా వ్యవహరించే ఆర్డీవోకు అందజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, సీనియర్ నాయకులు పట్లోళ్ళ నర్సిములు, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ చారి, ఉమాశంకర్, నరేందర్ గౌడ్, సిద్రాల శ్రీనివాస్, పాండురంగారెడ్డి, సలీం, రమేష్, శకుంతల, చంద్రశేఖర రెడ్డి, రాములు, ఇర్ఫాన్, వీరయ్య, సంతోష్ గౌడ్, జావేద్, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

