వడదెబ్బ మరణాలకు పరిహారం
– బాధిత కుటుంబాలకు లక్షల్లో సాయం
– ఎప్పుడు, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే..?
– ప్రభుత్వం డబ్బులు ఎందుకు ఇస్తుందో తెలుసుకోండి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఈ వేసవిలో సూరీడు.. భగ భగ మండుతున్నాడు. ఇప్పటికే 40 నుంచి 45 డిగ్రీల ఎండలు నమోదవుతున్నాయి. ఇంతటి ఎండలో వడదెబ్బలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. అనుకోవద్దు.. కానీ.. ఈ వేసవిలో వడదెబ్బతో ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఏసీల్లో, కూలర్ల కింద ఉండే వారికి ప్రమాదం లేకున్నా.. ఎండలో తీవ్రంగా పనిచేసే వారికి ప్రమాదఘటికలు వెన్నంటే ఉంటాయి. ఒకవేళ వడదెబ్బతో ఎవరైనా మరణిస్తే.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకునేందుకు చొరవ చూపుతోంది. పరిహారం కింద బాధిత కుటుంబాలకు లక్షల్లో ఆర్థిక చేయూతను అందిస్తోంది. వడదెబ్బ వల్ల మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే ఈ రూ. 4 లక్షల పరిహారం ‘స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (SDRF)’ నుండి మంజూరవుతుంది. ప్రకృతి వైపరీత్యాలు, ఎండతీవ్రత వంటి కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయినప్పుడు ఈ నిధి ద్వారా ఆదుకుంటారు.

నిబంధనలు ఇవే..
వడదెబ్బతో ఎవరైనా మరణించినప్పుడు, బాధిత కుటుంబాలు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పరిహారం అందాలంటే మరణం కేవలం వడదెబ్బ వల్లే జరిగిందని అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంటుంది. ఎవరైనా మరణిస్తే తప్పక పోస్టుమార్టం చేయించాలి. నివేదికలో మరణానికి కారణం ‘హైపర్ థెర్మియా’ (Hyperthermia) లేదా ‘వడదెబ్బ’ అని స్పష్టంగా ఉంటేనే పరిహారం అందుతుంది. మరణించిన 24 గంటల లోపు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పరీక్ష నిర్వహించాలి. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పంచనామా నిర్వహించి, ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలి. సదరు వ్యక్తి మరణించిన రోజున ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ (IMD) నుండి ధ్రువీకరణ పత్రం అవసరమవుతుంది. దీనిని రెవెన్యూ అధికారులే సేకరిస్తారు.

ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు..
మరణం సంభవించిన వెంటనే స్థానిక రెవెన్యూ యంత్రాంగానికి (VRO/RI) సమాచారం అందించాలి. పైన పేర్కొన్న పత్రాలన్నింటినీ జత చేసి స్థానిక తహసీల్దారు కార్యాలయం (MRO Office) లో దరఖాస్తు సమర్పించాలి. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, ఆ నివేదికను జిల్లా కలెక్టరుకు పంపిస్తారు. కలెక్టర్ ఆమోదం పొందిన తర్వాత, నిధులు నేరుగా బాధిత కుటుంబ సభ్యుడి బ్యాంక్ ఖాతాలో జమవుతాయి. అయితే దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పొందిన పోస్ట్మార్టం నివేదిక. పోలీస్ ఎఫ్ఐఆర్ (FIR) మరియు ఫైనల్ ఎంక్వైరీ రిపోర్ట్. మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ నుంచి జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం. మృతుడితో పాటు వారసుల (Nominee) ఆధార్ కార్డుల నకలు. పరిహారం మొత్తం నేరుగా జమ కావడానికి బ్యాంకు పాస్ బుక్ వివరాలు. కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాలు ఉంచుకోవాలి.


