కేంద్రానివి చిల్లర రాజకీయాలు
– తెలంగాణ రాష్ట్రాన్ని అబాసుపాలు చేసే కుట్ర
– రైతులకు మద్దతుగా నిలవడంలో కేంద్ర మంత్రులు విఫలం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వాఖ్యానించారు.

సోమవారం వికారాబాద్ జిల్లా తాండూరులో రైతు వారోత్సవాల ప్రారంభానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు చేస్తున్న విమర్శలను ఖండించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులుగా ఉన్న వారు రైతులకు అండగా నిలవడంలో, మద్దతు ధరలు అందేలా చూడడంలో విఫలం అయ్యారని అన్నారు.

రైతుల పంటలకు మద్దతు ధరలు అందించే బాధ్యత కేంద్రానిదే అని అన్నారు. రైతులకు యూరియా అందించే బాధ్యత కేంద్రంపై ఉన్నా రాష్ట్రంలో ఏర్పడిన కొరతను ప్రభుత్వంపై రుద్దిందని అన్నారు. గ్యాస్, డీజిల్ సమస్యలు తీర్చాల్సిన బాధ్యతపై కేంద్రంపై ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసేందుకు యత్నించిందని అన్నారు.

ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో అధికారం చేపట్టాలనుకుంటే ఎవ్వరు సహించరని అన్నారు. ఇటీవల అధికారం కోల్పోయిన ఓ పార్టీ కూడా ఇదే దోరణిలో రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య, తదితరులు ఉన్నారు.


