బీసీలను విస్మరిస్తే ఆశలు గల్లంతే..!
– బీజేపీ బీసీలపై స్పష్టమైన ప్రకటన చేయాలి
– కుల గణన, రిజర్వేషన్ల అంశాలను తేల్చాలి
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో బీసీలను విస్మరిస్తే ఆశలు గల్లంతు కావడం ఖాయమని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు.

శనివారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ ఈనెల 10న దేశ ప్రధాని నరేంద్రమోడి తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రానున్న నేపథ్యంలో బీసీల న్యాయబద్ధమైన హక్కుల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా బీసీలకు రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.

శాసనసభలు, స్థానిక సంస్థలు, ఇతర ఎన్నికల వ్యవస్థల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు ప్రత్యేక సబ్‌కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని సూచించారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా బీసీ కుల గణనపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం ప్రకటించాలని కోరారు.

తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్లకు పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించాలని రాజ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. బీసీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ దేశాన్ని నడిపించడం గర్వకారణమని పేర్కొన్న ఆయన, రేపు హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభలో తెలంగాణ బీసీలకు రాజకీయ రిజర్వేషన్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. బీసీల కోసం రాజకీయ ప్రకటనలు లేకుండా కేవలం డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో ముందుకు వెళితే తెలంగాణలో ఆశలు గల్లంతు చేసుకోవాల్సి వస్తుందని హితవు పలికారు.


