అనుమతిలేని నిర్మాణంపై కొరడా

తాండూరు రాజకీయం వికారాబాద్

అనుమతిలేని నిర్మాణంపై కొరడా
– వివాదాస్పద భూమిలో జేసీబీతో కూల్చివేతలు
– మున్సిపల్ ముందు ఉన్న స్థలంలో అధికారుల చర్యలు
– అధికారుల తీరును ఖండించిన యజమానులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వివాదాస్పద స్థలంలో అనుమతుల్లేకుండా చేపడుతున్న నిర్మాణాలపై తాండూరు మున్సిపల్ అధికారులు కొరడా జులిపించారు. జేసీబీ యంత్రాలతో నిర్మాణాలను కూల్చివేయించారు.

సోమవారం మున్సిపల్ ఎదురుగా ఉన్న స్థలంలో అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం కొత్త మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్న సర్వేనెంబర్ 130లోని 36 గుంటల భూమిలో గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. ప్రభుత్వ స్థలం అంటూ వార్డు కౌన్సిలర్ ఈర్షాద్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు యజమానులు ఇది సొంత స్థలం అంటూ ప్రకటించారు.

రెవెన్యూ శాఖలో కూడా భూమిపై వివాదాలు ఉన్నాయి. అయితే 36 గుంటల భూమిలో యజమానులు ఇటీవలే కాంప్లెక్స్ నిర్మాణ పనులు చేపట్టారు. దీనికి మున్సిపల్ నుంచి ఎలాంటి అనుమతులు లేవని ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం టౌన్ ప్లానింగ్ అధికారులు వివాదాస్పద స్థలం వద్దకు చేరుకుని జేసీబీ యంత్రంతో నిర్మాణాలను కూల్చివేయించారు.

ఈ క్రమంలో అధికారులు, యజమానుల మద్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసుల సమక్షంలో కూల్చివేతలు చేపట్టారు. దీనిపై యజమానులు మాట్లాడుతూ కాంప్లెక్స్ నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. రోజులు గడుస్తున్నా అధికారులు అనుమతులు ఇవ్వలేదని ఆరోపించారు. పట్టణంలో ఎన్నో అనుమతుల్లేని నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు, కావాలనే తమ భూమి విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దీనిపై న్యాయబద్దంగా ముందుకు సాగుతామని అన్నారు.

అనుమతి లేకుండా ఎద్దుల రవాణా