బండి భగీరథ్‌ను కఠినంగా శిక్షించాలి
– అరెస్టు చేయకుండా కాంగ్రెస్, బీజేపీల కుమ్మక్కు
– తాండూరులో బీఆర్ఎస్ నేతల నిరసన
తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర హోం శాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌ను కఠినంగా శిక్షించాలని తాండూరు బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

బుధవారం తాండూరు పట్టణం అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరద్ను ఫోక్సో చట్టం కింద బొక్కలో తోయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ తాండూరు నియోజకవర్గ ఇంచార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసును నీరుగార్చేందుకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు.

బండి భగీరథ్ విషయంలో కేసులు పెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని మండిపడ్డారు. బాధితురాలికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ పోరాటం చేస్తుంటే బీఆర్ఎస్పై నిందలు వేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీనే బాధితురాలి కోసం నిజాయితీగా పోరాడుతున్నదని స్పష్టం చేశారు.

బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరుకుల నరేందర్ గౌడ్, మాజీ ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ కౌన్సిలర్ పరిమళ, యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


