ఇందిరమ్మ కాలనీలో కట్టడి.. ముట్టడి..!
– తెల్లవారు జామున పోలీసుల కార్డెన్ సెర్చ్
– పరిశీలించిన తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య
– బైకులు, ఆటోలు సీజ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ఇందిరమ్మ కాలనీలో పోలీసులు కట్టడి, ముట్టడి చేపట్టారు.

బుధవారం తెల్లవారు జామున పోలీసులు కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీసులు కాలనీలోని ఇంటింటికి తిరిగి వివరాలను సేకరించారు. ఇంట్లో ఉంటున్న వారి ఆధార కార్డులను పరిశీలించారు. ఇళ్లలో ఉన్న వాహనాల పత్రాలను కూడా పరిశీలించారు.

డీఎస్పీ నర్సింగ్ యాదయ్య కార్డన్ సెర్చ్ లో పాల్గొని పరిశీలించారు. ఎవరైనా అనుమానితులు నివాసం ఉంటున్నారా అని ఆరా తీశారు. అనంతరం పత్రాలు లేని బైకులు, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసమే కార్డెన్ సెర్చ్ కార్యక్రమం చేపట్టం జరిగిందన్నారు. ప్రజలందరు శాంతి భద్రతలకు సహకరించాలన్నారు.

ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. మహిళల పట్ల సత్ప్రవర్తనతో ఉండాలని సూచించారు. మరోవైపు సీజ్ చేసిన వాహనాలకు సంబంధించి పత్రాలను చూపించి వాటిని తీసుకెళ్లవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు పరమేశ్వర్ గౌడ్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, పోలీసు సిబ్బంది, వార్డు కౌన్సిలర్ జావిద్, కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


