అర్ధరాత్రి దాటాక ఆలయంలో చోరీ
– దేవుని ఆభరణాలు, సామాగ్రి అపహరణ
– సిరిగిరిపేట్ గ్రామంలో ఘటన
– కరణ్ కోట్ పోలీసులకు గ్రామస్తుల ఫిర్యాదు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : అర్దరాత్రి దాటిన తరువాత గుర్తుతెలియని వ్యక్తులు దేవాలయంలో చోరీకి పాల్పడ్డారు.

దేవునికి సంబంధించిన ఆభరణాలు, సామాగ్రితో ఉడాయించారు. ఈ సంఘటన తాండూరు మండలం సిరిగిరిపేటలో చోటు చేసుకుంది. గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో అర్దరాత్రి దాటిన తరువాత 2 గంటల ప్రాంతంలో ఆలయం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రావడంతో అక్కడే ఉన్న వీధి కుక్కలు అరుపులు మొదలయ్యాయి.

తలుపుల శబ్దంతో నిద్ర మేల్కొన్న స్థానికులు దేవాలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ తలుపులు ధ్వంసం అయినట్లు కనిపించడంతో లోపలికి వెళ్లి పరిశీలించారు. దేవాలయంలో ఉండాల్సిన రూ.20వేలు విలువజేసే వెండి ఆభరణాలు, సామాగ్రి చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే స్థానికులు గ్రామ సర్పంచ్ పరుశురాంకు తెలిపారు.

ఆయన కరణ్ కోట్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఏఎస్ఐ పవన్ బృందం ఆలయం వద్దకు చేరుకున్నారు. దేవాలయంలో చోరీ జరిగిన విధానంను పరిశీలించి స్థానికుల ద్వారా వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ సంఘటన స్థానికంగా కలవరంకు గురిచేసింది.


