కక్ష్యపూరిత అడ్డంకులకు అదరను
– సంక్షేమం, అభివృద్ధిని ఎప్పటికి ఆపను
– నియోజకవర్గ నిరుపేదల సంక్షేమమే ధ్యేయం
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– రాండమైజేషన్‌తో డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : అభివృద్ధి విషయంలో ఎన్ని కక్ష్య పూరిత అడ్డంకులను సృష్టించినా అదర కుండా, బెదరకుండా దూసుకపోవడమే తన నైజం అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ద్వజమెత్తారు.

శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ర్యాండమైజేషన్ విధానం ద్వారా లబ్దిదారుల ఎంపిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అడిషనల్ కలెక్టర్ లు ఉమాశంకర్ ప్రసాద్, వెంకట చారి, కౌన్సిలర్ల సమక్షంలో రాండమైజేషన్ ద్వారా ఎంపిక చేసిన లబ్దిదారుల వివరాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరు పట్టణంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు మొత్తం 8,333 దరఖాస్తులు రాగా మొదటి విడతలో 581 లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి త్వరలో పట్టాలు అందించడం జరుగుతుందని అన్నారు. గత పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇళ్లను అందించలేకపోయిందన్నారు. నియోజకవర్గంలోని రోడ్ల విషయంలో, కోట్‌పల్లి, జుంటుపల్లి ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి శ్రద్ద చూపించలేకపోయారని విమర్శించారు. గత రెండున్నరేళ్లలో నమ్మి గెలిపించిన ప్రజల కోసం అభివృద్ధి చేయడం జరిగిందని.. అభివృద్ధి విషయంలో ఏ చర్చకైనా సిద్దమని సవాల్ విసిరారు. కాంగ్రెస్ హాయాంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. పారదర్శకంగా రేషన్ కార్డులు అందించడం జరిగిందని గుర్తుచేశారు.

తాజాగా డబుల్ బెడ్ రూం ఇళ్లను కాంగ్రెస్ జెండాను మోసిన వాళ్లకు కాకుండా నిజమైన అర్హులను ఎంపిక చేసి అందజేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కొందరు అజ్ఞానులు తాండూరులోని జిల్లా ఆసుపత్రి విషయంలో కూడా దుష్ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఉన్న జిల్లా ఆసుపత్రిలో అన్ని విభాగాలను కలిపి వైద్య సేవలను మెరుగు పరిచే విధంగా ప్రయత్నాలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించాలని చూసినా అదరను.. బెదరను.. అభివృద్ధిని ఆపను అని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో మరింత శ్రద్దతో పనిచేసే బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు.

డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో ప్రస్తుతం 581మందికి అందజేసి.. రెండో విడతలో కూడా నిరుపేదలకు అందించే బాధ్యత తమపై ఉందని అన్నారు. తాండూరులో జరుగుతున్న అన్ని విషయాలను ప్రజలు గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, పిడి హౌసింగ్ దశరథ్ సింగ్, మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, నాయకులు ప్రభాకర్ గౌడ్, అబ్దుల్ రవూఫ్, అఫ్పూ(నయూం), కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, మాజీ ఫ్లోర్ లీడర్ సోమశేఖర్, ఎంఐఎం పార్టీ అధ్యక్షులు హాది, అధికారులు, సానిక కౌన్సిలర్లు, ఫ్లోర్ లీడర్లు, వివిధ పార్టీల నాయకులు, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.


