ఎవరు.. తొలగిపోతారో..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎవరు.. తొలగిపోతారో..!
– తాండూరులో డబుల్ టెన్షన్
– అనర్హుల ఏరివేతకు రంగం సిద్దం
– ఎంపిక కాని లబ్దిదారుల్లో ఆశలు
– అనర్హులను ఎలా తొలగిస్తారంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో పేదల కోసం నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కేటాయింపుపై టెన్షన్ కొనసాగుతోంది. చాలా ఏళ్లుగా పేదలకు ఇండ్లను పంపిణీ చేయకపోవడంతో నిరాశలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ ఇళ్ల పంపిణీకి ముందడుగు వేయడంతో సొంతింటి కల కోసం ఆశలు పెంచుకున్నారు.

అయితే ఇటీవల జరిపిన లబ్దిదారుల ఎంపికలో అనర్హులకు ఇండ్లను కేటాయించారనే ఆరోపణలు వచ్చాయి. అప్పటికే అధికారులు అనర్హుల ఏరివేతకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇప్పుడు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల అనర్హుల లబ్దిదారుల ఏరివేతకు అధికారులు కసరత్తును ముమ్మరం చేశారు. ప్రత్యేక పరిశీలన కమిటిని ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో డబుల్‌ బెడ్ రూం ఇళ్ల అర్హుల ఎంపికపై ఉత్కంఠత ఏర్పడింది. పరిశీలన కమిటి అనర్హులను ఎలా గుర్తిస్తారు.. నిజమైన లబ్దిదారులకు ఇళ్ల కేటాయింపు ఎలా చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు శ్రీకారం చుట్టింది. తాండూరు మున్సిపల్ పరిధిలోని పేదల కోసం తాండూరు- హైదరాబాద్‌ మార్గంలోని ఖాంజాపూర్‌ గేటు వద్ద పదేళ్ల కిందట ఇళ్ల నిర్మాణం చేపట్టింది. మొత్తం 1,001 ఇళ్లకు 581 సిద్ధం చేశారు. లబ్దిదారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా 8,333 దరఖాస్తులు వచ్చాయి. నిజానికి గత ప్రభుత్వంలోనే ఇళ్ల కేటాయింపు జరగాల్సింది. కాని ఎన్నికలు రావడంతో ప్రక్రియ వాయిదా పడింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్‌, అధికారులు ఇండ్ల కేటాయింపుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

గత శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో డబుల్‌ బెడ్ రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపికను చేపట్టారు. పట్టణంలోని 36 వార్డుల నుంచి వచ్చిన 8,333 దరఖాస్తుల్లో కంప్యూటర్ ద్వారా రాండమైజేషన్ పద్దతిలో 581 మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. ఈ విధానంపై ప్రతిపక్షాలు, ప్రజలు అనుమానాలను వ్యక్తం చేశారు. దీంతో ఇదే వేదికపై అధికారులు స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఎంపిక చేసిన లబ్దిదారులు ఫైనల్ కాదని, ఎంపిక చేసిన లబ్దిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతామని వెల్లడించారు. ఇందులో అనర్హులుగా తేలితే.. వారిని తొలగించి నిజమైన అర్హులకు ఇళ్ల కేటాయింపుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అనర్హుల ఏరివేతకు రంగం సిద్దం
డబుల్‌ ఇండ్ల కేటాయింపులో రాండమైజేషన్ ద్వారా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి, కౌన్సిలర్‌ భార్యకు, ఆర్ధికంగా ఉన్న వారికి ఇళ్లు ఎంపిక అయ్యాయి. ఇలాంటి పరిణామాలు జరగకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అనర్హులను ఏరివేసేందుకు ప్రత్యేక కమిటిని ఏర్పాటు చేయనున్నారు. పురపాలిక శాఖ, రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ అధికారులతో ఓ కమిటీ వేయనున్నారు. ఈ అధికారులు పట్టణంలోని 36 వార్డుల్లో పర్యటించి డ్రాలో ఎంపికైన లబ్ధిదారులను కలిసి పూర్తి వివరాలు సేకరిస్తారు. సొంతిల్లు ఉందా? అద్దె ఇంట్లో ఉంటున్నారా? ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందన్న వివరాలను సేకరిస్తారు. వాటి ప్రకారమే అర్హుడైతే ఇల్లును కేటాయిస్తారు. అనర్హుడని తేలితే ఎంపిక జాబితా నుంచి పేరును తొలగించనున్నారు.

చేనేత హస్తకళలను ఆదరించాలి