గ్రామీణ రోడ్లకు మహర్దశ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

గ్రామీణ రోడ్లకు మహర్దశ..!
– రూ.289 కోట్లతో అభివృద్ధి బాటలు
– హ్యామ్‌ నిధులతో రోడ్ల సమస్యలకు పరిష్కారం
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత రోడ్లకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో మహర్ధశ పట్టబోతోంది.

తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మకంగా చేపట్టబోతున్న హ్యామ్‌(హైబ్రీడ్ యాన్యునిటి మోడల్‌) ప్రాజెక్టు ద్వారా రూ.13వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాకు రూ. 520 కోట్లు మంజూరయ్యాయి.

ఇందులో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక కృషితో నియోజకవర్గానికి రూ. 289 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో తాండూరు –పెద్దేముల్, పెద్దేముల్–కోట్‌పల్లి, లక్ష్మీనారాయణపూర్ – దేవనూర్, కమాల్‌పూర్ – రాస్నం వంటి కీలక రోడ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ పనులతో వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించబోతోంది. యాలాల మండలం కోకట్ వద్ద హై లెవల్ వంతెన నిర్మాణం కూడా చేపట్టనున్నారు.

ఈ అభివృద్ధి పనులతో తాండూరు నియోజకవర్గంలోని పల్లె రోడ్లు అభివృద్ధి బాట పట్టబోతున్నాయి. ఈ నిర్ణయంపై ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తాండూరు నియోజకవర్గానికి హ్యామ్ ద్వారా నిధులు కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కాలనీ ఓటర్లపై కాంగ్రెస్ కపటం..!