కొత్త ఫించన్ నీరీక్షణకు తెర..!
– తుది దశకు ఒంటరి మహిళల ఎంపిక
– ఫించన్ల మంజూరు ఆరోజు నుంచే
– ఎంపిక కోసం ఉపయోగిస్తున్న విధానం ఇదే
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఫించన్ల కోసం ఎదురుచూస్తున్న ఒంటరి మహిళల నీరీక్షణకు తెరపడే రోజు త్వరలోనే రాబోతోంది. ఫించన్ల మంజూరు కోసం కాంగ్రెస్ సర్కారు అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తోంది. ఫించన్ల మంజూరు కోసం తేదినీ కూడా ఖరారు చేసినట్లు పరిణామాలు కనిపిస్తున్నాయి.

ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించిన తెలంగాణ సర్కార్, వాటిని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అందరికీ పింఛన్లు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

సాంకేతిక వినియోగం
పథకాల అమలులో ఎలాంటి జాప్యం లేకుండా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పింఛన్ల పంపిణీ చేయాలని నిర్ణయించింది. పింఛన్ పొందుతున్న వారి లబ్ధిని నిర్ధారించేందుకు ప్రభుత్వం లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ కొనసాగిస్తోంది. ఈ నెలాఖరులోపు ఈ ప్రక్రియను పూర్తి చేసి.. ఆగస్టు నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ డబ్బులు అందజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

అర్హులకు మాత్రమే అందేలా
అనర్హులు పింఛన్లు పొందడం వల్ల నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని.. కాబట్టి కేవలం అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పింఛన్లు పొందుతున్న అర్హులు ఎవరైనా మరణిస్తే.. జాబితా నుంచి వారి పేర్లను తొలగించేందుకు చర్యలు చేపట్టింది. అలాగే ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లో అవగాహన పెంచాలని.. అర్హత ఉండి కూడా లబ్ధి పొందని వారిని గుర్తించి.. పథకాలను వర్తింపజేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.


