భగ్గుమన్న ఏబీవీపీ..!
– రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై తాండూరు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) నాయకులు భగ్గుమన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన చేపట్టి ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. గురువారం ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పల రాజేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. భారత మాతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వెంటనే మీడియా సమక్షంలో దేశ ప్రజలందరికీ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఏబీవీపీ నాయకులు, యువకుల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ పట్టణ కార్యదర్శి మనికొండల రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు మౌనేష్ చారి, సహాయ కార్యదర్శి వినోద్, ఏపీవీపీ పట్టణ సోషల్ మీడియా ఇంఛార్జి నవీన్ గౌడ్, మారుతి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

