కేంద్రం కుట్రలు సాగనివ్వం..!
– అర్హులైన ఓటర్లందరిని కాపాడుకోవాలి
– తాండూరులో 70శాతం ఎస్‌ఐఆర్ పూర్తి
– ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– పాల్గొన్న టీపీసీసీ పర్యవేక్షకులు కోటిం వినయ్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓటర్ల తొలగింపు కోసం కేంద్రం సాగిస్తున్న కుట్రలను సాగనిచ్చేది లేదని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

గురువారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఎస్ఐఆర్‌పై తాండూరు పట్టణ బీఎల్‌ఏలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, టీపీసీసీ పర్యవేక్షకులు కోటిం వినయ్ రెడ్డితో కలిసి బీఎల్‌ఏలకు అవగాహన కల్పించారు.

ఎస్‌ఐఆర్ నమోదులో బీఎల్‌ఏలు కీలకపాత్ర పోషించాలని అన్నారు. ఇంకా 10రోజులు కష్టపడి పనిచేసి అర్హులైన ఓటర్లను కాపాడుకోవడంలో బాధ్యతగా పనిచేయాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ఓట్ చోర్ విధానానికి పాల్పడుతుందని విమర్శించారు. అక్రమంగా ఓటర్లను తొలగించేందుకు కుట్రలు చేస్తుందని అన్నారు. ఎస్ఐఆర్ ద్వారా అర్హులైన ఓటర్లందరని కాపాడుకుంటామని, కేంద్రం కుట్రలను సాగనివ్వమని అన్నారు.

ఇప్పటికే తాండూరు నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ 70శాతంపైగా పూర్తి అయ్యిందని తెలిపారు. మిగతా శాతాన్ని ఈ పదిరోజుల్లో పూర్తి చేసి తీరుతామని పేర్కొన్నారు. ఇందుకు పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు సంపూర్ణ సహాకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ కన్వీనర్ పురుషోత్తం రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాగరాజు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, బీఎల్ఏలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


