డీపోల లాభాల భాద్యత అందరిది
– సంస్థ అభివృద్ధికి కార్మికులు కృషి చేయాలి
– ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి
– తాండూరు డీపో సందర్శన, ఎమ్మెల్యేతో భేటి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ డీపోను లాభాల బాటలోకి తీసుకరావడంలో అధికారులతో పాటు కార్మికులపై బాధ్యత ఉంటుందని ఆర్టీసీ రీజీనల్ మేనేజర్(ఆర్ఎం) శ్రీదేవి అన్నారు.

మంగళవారం ఆమె డిప్యూటీ ఆర్ఎం సరస్వతితో కలిసి తాండూరు డిపోను సందర్శించారు. డిపోలో దస్తాలను పరిశీలించారు. బస్సులు రోజువారీగా తిరుగుతున్న కిలోమీటర్లు, రాబడి, ఖర్చు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

డిపో ఆవరణంలో మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం కార్మికులతో మాట్లాడుతూ సమయానుకూలంగా బస్సులు నడిపిస్తే ప్రయాణికులకు ప్రయోజనంతో పాటు ఆర్టీసీ పై ప్రజలకు మరింత నమ్మకం ఉంటుందని అన్నారు. ఉచిత టికెట్లతో పాటు నగదు టికెట్ల జారీ కి కండక్టర్లు , డ్రైవర్లు కృషి చేయాలని అన్నారు. డిపోలను లాభాల బాటలోకి తీసుకురావాలని అన్నారు. విధుల పట్ల బాధ్యత, క్రమశిక్షణ తో సిబ్బంది ఉంటే మంచి పేరు తెచ్చుకుంటారని అన్నారు.

అనంతరం తాండూరుకు వచ్చిన ఆర్ఎం శ్రీదేవి, డిప్యూటీ ఆర్ఎం సరస్వతితో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. తాండూరు ఆర్టీసీ డిపోలోని సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ కు సమస్యలు వివరించి, పరిష్కారానికి చొరవ చూపిస్తానని తెలిపినట్లు ఆర్టీసీ డిపో ప్రతినిధులు తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డిని కూడా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్, ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు.


