తెలంగాణలో ఒమిక్రాన్‌ లేదు..

ఆరోగ్యం తెలంగాణ హైదరాబాద్

తెలంగాణలో ఒమిక్రాన్‌ లేదు..
– అయినా కరోనా జాగ్రతలు త‌ప్ప‌నిస‌రి
– ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు
హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ లేద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కేసు కూడ న‌మోదు కాలేద‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. మంగ‌ళ‌వారం నిమ్స్ ఆస్పత్రిను సందర్శించిన మంత్రి ఆసుపత్రిలోని మెడికల్‌ జెనెటిక్స్‌ లేబొరేటరీ మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్‌ యూనిట్‌తో పాటు ఎండోస్కోపిక్ ప‌రిక‌రం, ఎంఆర్‌యూ ల్యాబ్‌, స్టెమ్ సెల్ రీసెర్చ్ ఫెసిలిటీ, ఫిజియోథెర‌పీ విభాగం, బోన్ డెన్సిటోమీట‌ర్, శాంపిల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం, వాట‌ర్ ఏటీఎంల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ‌లో ఒమిక్రాన్ కేసులు న‌మోదు కాలేద‌ని స్ప‌ష్టం చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేప‌థ్యంలో అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. అయినా ప్ర‌జ‌లు ముందుజాగ్ర‌త్త‌గా నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌న్నారు. భౌతిక దూరం, మాస్కులు, శానిటైజ‌ర్‌ల‌ను వినియోగించాల‌ని సూచించారు. అంత‌కుముందు నిమ్స్‌లో ప‌రిక‌రాల కోసం రూ. 154 కోట్లు మంజూరు చేశామ‌న్నారు. ప్ర‌స్తుతం రూ. 12 కోట్లతో మెడికల్ ప‌రిక‌రాల‌ను రోగుల‌కు అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని తెలిపారు. రోగుల‌కు ఉన్న‌త చికిత్స‌లు అందించే ప‌రిక‌రాల‌ను ప్రారంభించామ‌ని తెలిపారు. జ‌న్యుప‌ర వ్యాధుల విశ్లేష‌ణ‌, గుర్తింపున‌కు కొత్త ల్యాబ్ ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొన్నారు. నిమ్స్‌లో రూ. 2.73 కోట్ల‌తో న్యూమాటిక్ ట్యూబ్ సిస్ట‌మ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామ‌న్నారు. రూ. 40 ల‌క్ష‌ల‌తో అత్యాధునిక న్యూరో ఎండోస్కోపి ఏర్పాటు చేశారు. నిమ్స్‌లో ప్ర‌స్తుతం 89 వెంటిలేట‌ర్లు అందుబాటులో ఉన్నాయ‌ని, మ‌రో 120 వెంటిలేట‌ర్లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. అదేవిధంగా ప్ర‌స్తుతానికి 155 ఐసీయూ ప‌డ‌క‌లు అందుబాటులో ఉన్నాయ‌న్నారు. అద‌నంగా 200 ఐసీయూ ప‌డ‌క‌లు అందుబాటులోకి తీసుకొస్తామ‌న్నారు. కొత్త బెడ్లు జ‌న‌వ‌రి 15 నాటికి అందుబాటులోకి రానున్నాయ‌ని పేర్కొన్నారు. ఇక్క‌డ రూ.5 కే భోజ‌నం స‌ర‌ఫ‌రా చేయాల‌ని కోరారు. ఇది అమ‌లు చేస్తామ‌ని హ‌రీశ్‌రావు ప్ర‌క‌టించారు.