ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
– హక్కుల కోసం పీఆర్టీయూ పోరాటం ఆపదు
– హైదరాబాద్ తరలి వెళ్లిన యాలాల నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పీఆర్టీయూ నేతలు డిమాండ్ చేశారు.

మంగళవారం పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహిస్తున్న మహాధర్నాకు యాలాల మండలం నుంచి ఉపాధ్యాయులు భారీగా తరలివెళ్లారు. మండల అధ్యక్షుడు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి పరమేష్, కార్యవర్గ సభ్యులు సి. కృష్ణారెడ్డి తదితరులు బయల్దేరి వెళ్ళారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల చిరకాల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

ముఖ్యంగా పీఆర్సీ కమిషన్ నివేదికను వెంటనే తెప్పించి అమలు చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని కోరారు. 2003 డీఎస్సీ ద్వారా ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

“ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.. ఇచ్చిన మాట గుర్తు చేద్దాం” అనే నినాదంతో ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం చేపట్టిన మహాధర్నాను విజయవంతం చేసేందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ నాయకులు ఆశనప్ప, శివకుమార్, రవి, గులాబ్‌సింగ్, షేక్ అహ్మద్‌తో పాటు పలువురు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ఉన్నారు.


