లక్ష్య సాధనతోనే ఉత్తమ భవిష్యత్తు
– అంబేద్కర్ పారమెడికల్ కరస్పాండెంట్ డా.శివానంద్ సింగ్
– ఫ్రెషర్స్‌కు గ్రాండ్ వెల్కమ్.. ఆట పాటలతో అదరగొట్టిన విద్యార్థులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : లక్ష్య సాధనతోనే విద్యార్థులు ఉత్తమ భవిష్యత్తును నిర్మించుకుంటారని అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత, తాండూరు అంబేద్కర్ పారమెడికల్ కాలేజీ కరస్పాండెంట్ డా.శివానంద్ సింగ్ అన్నారు.

కళాశాల ఫ్రెషర్స్ పార్టీ వేడుకలు గురువారం పట్టణంలోని తులసీ గార్డెన్లో ఉత్సాహాంగా జరుపుకున్నారు. నూతన విద్యార్థులకు సీనియర్లు ఘనంగా స్వాగతం పలికారు. విద్యార్థుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాటలు, ఆటపాటలతో విద్యార్థులు ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్, జాతీయ అవార్డు గ్రహీత డా. శివానంద్ సింగ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దానిని సాధించే దిశగా క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. చదువుతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చని తెలిపారు.

పారామెడికల్ విద్యకు వైద్య రంగంలో ఎంతో ప్రాధాన్యత ఉందని, ఇక్కడ శిక్షణ పొందిన పారామెడికల్ సిబ్బందికి అవకాశాలు ఉంటాయని వివరించారు. కళాశాల ద్వారా పేద విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పాటు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నూతన విద్యార్థులు సైతం ఉత్సాహంగా పాల్గొని వేడుకలను సందడిగా మార్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


