కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్..!

జాతీయం తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్..!
– అర్హులకు దసరా నుంచే కానుక
– లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు
– ఎంత మంది ప్రయోజనం అంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పేందుకు సిద్ధమైంది. చేయూత పథకం కింద కొత్తగా 2.50 లక్షల పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇందుకు సంబంధించిన ప్రక్రియను అధికారులు వేగవంతం చేస్తున్నారు. కొత్త పింఛన్ల కోసం ఇప్పటికే భారీగా దరఖాస్తులు అందాయి. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 25లోగా వెరిఫికేషన్ పూర్తి చేసి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

దసరా నుంచే చెల్లింపులు?
వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం తుది జాబితాను సిద్ధం చేసి కొత్త పింఛన్ల పంపిణీ చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దసరా నుంచి కొత్త లబ్ధిదారులకు పింఛన్ అందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. దీంతో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు తదితర వర్గాల్లో ఆశలు పెరిగాయి.

అర్హతే ప్రామాణికం
దరఖాస్తుల పరిశీలనలో అర్హత ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. క్షేత్రస్థాయి విచారణ అనంతరం అర్హులైన వారితో తుది జాబితా రూపొందించనున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన 2.50 లక్షల కొత్త పింఛన్లతో రాష్ట్రంలో మరింత మంది నిరుపేదలకు ఆర్థిక భరోసా లభించనుంది.

సమ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం..!