బీసీ స్మశాన వాటికల రూపు రేఖలు మారుస్తాం
– దశలవారీగా మౌలిక వసతుల కల్పన
– ప్రధాన బీసీ శ్మశాన వాటికకు రూ.10 లక్షలు
– ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి
– పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులోని బీసీ శ్మశాన వాటికల రూపు రేఖలు మహర్దశ మార్చేందుకు కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు.

శ్మశాన వాటికల్లో మౌలిక వసతులు కల్పించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. తాండూరు పట్టణంలోని ప్రధాన బీసీ శ్మశాన వాటికలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన బీసీ శ్మశాన వాటిక అభివృద్ధికి ఇప్పటికే రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.

అవసరమైన మౌలిక వసతులతో పాటు పరిశుభ్రత, సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అదేవిధంగా పాత తాండూరులోని 14వ వార్డు బోనమ్మ ఆలయం సమీపంలోని శ్మశాన వాటికకు ఏడాది క్రితమే బోరు ఏర్పాటు చేసి నీటి సౌకర్యం కల్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

అక్కడ ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. త్వరలో పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పారు.నియోజకవర్గంలోని అన్ని బీసీ శ్మశాన వాటికలను దశలవారీగా అభివృద్ధి చేస్తామని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి, కమిషనర్ రాకేష్, కౌన్సిలర్లు, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


