శ్రీ సాయి మేధ విద్యాలయంలో బతుకమ్మ వేడుకలు

తాండూరు రాజకీయం వికారాబాద్

శ్రీ సాయి మేధ విద్యాలయంలో బతుకమ్మ వేడుకలు
– బతుకమ్మ పండుగ ప్రకృతి ఆరాధన
– కరస్పాండెంట్ పెరుమాళ్ళ వెంకట్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : బతుకమ్మ అంటే కేవలం ఒక పండుగ కాదు.. అది ప్రకృతిని, పూలను, నీటిని ప్రేమించే మన జీవన విధానమని పెరుమాళ్ళ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పెరుమాళ్ళ వెంకట్ రెడ్డి అన్నారు.

శుక్రవారం తాండూరు పట్టణం శివాజీ చౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయం బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా ఆడి పాడారు. వివిధ రకాల పూలతో బతుకమ్మను చేసి సంప్రదాయ దుస్తులను ధరించి బతుకమ్మ పాటలకు చిందులు వేశారు.

అనంతరం చెరువులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పెరుమాళ్ళ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ప్రకృతి ఆరాధన అన్నారు. భాద్రపద అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ వేడుకను జరుపుకుంటామని తెలిపారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి తీరొక్క పూలతో గౌరమ్మను పేర్చి ఎంతో భక్తిశ్రద్ధలతో పూలనే దైవంగా భావించి పూజించే అపురూపమైన సంప్రదాయం మన తెలంగాణ సొంతమని పేర్కొన్నారు.

బతుకమ్మ పండుగ మనలో ఐక్యతను, సంతోషాన్ని పంచుతుందన్నారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యతను మనకు గుర్తు చేస్తుందని తెలిపారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పిన మన బతుకమ్మ పండుగను మనం తరతరాలుగా ఇలాగే బాధ్యతతో కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

జిల్లా యువ క్రికెటర్లకు సూపర్ ఛాన్స్‌