రాయల్టీ, సుద్ద లీజులపై గళం

తాండూరు రాజకీయం వికారాబాద్

రాయల్టీ, సుద్ద లీజులపై గళం
– తాండూరు సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావన
– ప్రత్యేక దృష్టిసారించాలని కోరిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తాండూరు నాపరాతి, సుద్ద ఖనిజ సంపదపై వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గళమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు సమస్యలను స్పీకర్ దృష్టికి తీసుకవచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా, స్పీకర్ గడ్డం ప్రసాద్ రెడ్డిల సొంత ప్రాంతమంటూ గుర్తు చేస్తూ సమస్యలను ప్రస్తావించారు. తాండూరు నియోజకవర్గంలో నాపరాతి పరిశ్రమ, సుద్ద ఖనిజాలపై ఆధారపడి దాదాపు 15వేల మంది యజమానులు, కార్మికులు ఉపాధి పొందుతున్నారని అన్నారు. నాపరాతి రాయల్టీ విషయంలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

కర్ణాటకలో రాయల్టీ తక్కువ ధర ఉండడంతో తెలంగాణ సరిహద్దులోని నాపరాతి వ్యాపారులు నష్టపోతున్నారని అన్నారు. అదేవిధంగా పెద్దేముల్ మండలంలోని సుద్ద ఖనిజాల విషయంలో లీజు అనుమతులు పొందేవిషయంలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తెలంగాణలో కూడా కర్ణాటక పాలసీ అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో ప్రధాన ప్రాజెక్టులైన కోట్ పల్లి, జుంటుపల్లి ప్రాజెక్టుల ఆధునీకరణకు సహకారం అందించాలని కోరారు. అంతేకాకుండా తాండూరులో మైనింగ్ కాలేజీ, ఐటీఐ కాలేజీలలో మౌళిక సదుపాయాలు కల్పించే విధంగా చూడాలన్నారు.

బషీరాబాద్ మండలంలో జీవోకే పరిమితమైన కాలేజీ విషయంలో చొరవ చూపి అద్యాపకులు, మౌళిక సదుపాయాలను కల్పించాలని కోరారు. ముఖ్యంగా తాండూరులో దేశవ్యాప్తంగా జీఐ గుర్తింపు పొందిన కంది పంట రైతులకు మేలు జరగాలంటే కందిబోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమస్యలపై రాష్ట్ర ఆర్అండ్ బీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృసి చేస్తామని హామి ఇచ్చారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!