ధర్నా రోజే దక్కిన ఊరట..!
– కార్మికుల ఖాతాల్లో వేతనాల జమ
– చైర్‌పర్సన్ నీరజా బాల్‌రెడ్డి కృషితో చెల్లింపు
– కృతజ్ఞతలు తెలిపిన మున్సిపల్ కార్మికులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: దసరా పండగ వేళ వేతనాలు అందక ఆందోళన చెందిన తాండూరు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఊరట లభించింది. శుక్రవారం ఉదయం వేతనాల కోసం విధులు బహిష్కరించి ధర్నాకు దిగిన కార్మికుల ఖాతాల్లో అదే రోజు సాయంత్రం వేతనాలు జమ అయ్యాయి.

పండగకు ముందే వేతనాలు అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులు పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అక్కడికి చేరుకుని కార్మికులతో మాట్లాడారు. వేతనాల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లి వేతనాల చెల్లింపునకు చొరవ చూపారు. దీంతో ఉదయం నుంచి ఆందోళనలో ఉన్న కార్మికుల ఖాతాల్లో సాయంత్రానికే వేతనాలు జమ కావడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కార్మికులు చైర్‌పర్సన్ నీరజా బాల్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై వేతనాల విషయంలో కార్మికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చైర్‌పర్సన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ అబ్దుల్ రజాక్, మున్సిపల్ అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.


