వైద్య సేవలు మావే.. స్టైపెండ్‌లో వివక్ష ఎందుకు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

వైద్య సేవలు మావే.. స్టైపెండ్‌లో వివక్ష ఎందుకు..!
– రూ.29,792 చెల్లించాలని ఎఫ్‌ఎంజీఈ ఇంటర్న్‌ల డిమాండ్‌
– తాండూరులో మూడో రోజుకు చేరిన నిరసన
తాండూరు, దర్శిని ప్రతినిధి : వైద్య సేవలు అందించడంలో ఇతర ఇంటర్న్‌లతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమకు స్టైపెండ్‌ చెల్లింపుల్లో మాత్రం వివక్ష ఎందుకని విదేశీ వైద్య విద్యార్థులు(ఎఫ్‌ఎంజీఈ) ప్రశ్నిస్తున్నారు.

తాండూరులోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం వద్ద ఎఫ్‌ఎంజీఈ ఇంటర్న్‌ల ఆందోళన శనివారానికి మూడో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసి, ఎఫ్‌ఎంజీఈ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నామని తెలిపారు.

ఇతర ఇంటర్న్‌ల మాదిరిగానే ఔట్‌ పేషెంట్‌ విభాగం, ఆపరేషన్‌ థియేటర్‌, వార్డుల్లో విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమకు నెలకు కేవలం రూ.5 వేలే స్టైపెండ్‌గా ఇస్తున్నారని వారు పేర్కొంటున్నారు. పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో ఈ మొత్తం జీవన అవసరాలకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు నెలకు రూ.29,792 స్టైపెండ్‌ చెల్లించడంతోపాటు అర్హమైన కాలానికి సంబంధించిన బకాయిలను కూడా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

స్టైపెండ్‌ అంశంపై సంబంధిత అధికారులు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ నెల 14వ తేదీలోగా సమస్య పరిష్కారం కాకపోతే హైదరాబాద్‌లోని వైద్య విద్య సంచాలకుల కార్యాలయం లేదా ధర్నా చౌక్‌ వద్ద నిరసన చేపడతామని ప్రకటించారు. సమాన పనికి సమాన స్టైపెండ్‌ అందించేలా ప్రభుత్వం, సంబంధిత వైద్య ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

అందరూ మెచ్చేలా.. అందరివాడిలా..!