కేవీసీఎస్‌లో సంబరాల హోరు..!
– అంబరాన్నంటిన బతుకమ్మ, దసరా వేడుకలు
– ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు
– చెడుపై విజయానికి ప్రతీకగా రావణ సంహారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోట్లీ మహరాజ్ దేవాలయంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్(కేవీసీఎస్)లో ప్రీ-దసరా, ప్రీ-బతుకమ్మ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన విద్యార్థులు ఆటపాటలు, నృత్యాలు, దాండియా ప్రదర్శనలతో సందడి చేశారు. పాఠశాల ప్రాంగణం సంబరాల హోరుతో నిండిపోయింది. పాఠశాల ప్రిన్సిపల్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్, డైరెక్టర్ సతీష్‌ల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. దుర్గామాత పూజ, వందేమాతరం కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభమయ్యాయి.

అనంతరం బతుకమ్మకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ప్రీ-ప్రైమరీ నుంచి తొమ్మిది, పదో తరగతి విద్యార్థులు ప్రదర్శించిన రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మ చుట్టూ నృత్యాలు, దాండియా కార్యక్రమాల చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో భాగంగా రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేసి చెడుపై మంచి విజయానికి ప్రతీకగా నిలిచే దసరా సందేశం మైమరిపించింది.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. శ్రీరాముడు రావణుడిపై సాధించిన విజయం సత్యం, ధర్మం, న్యాయం గొప్పతనాన్ని చాటుతుందని వివరించారు.

విద్యార్థులు చదువుతోపాటు క్రమశిక్షణ, నిజాయితీ, వినయం, దయ, ధైర్యం వంటి సద్గుణాలను అలవర్చుకోవాలని సూచించారు. మంచి మార్కులు సాధించడంతోపాటు విలువలు కలిగిన పౌరులుగా ఎదగడమే విద్యకు అసలైన లక్ష్యమని అన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొనగా జాతీయ గీతాలాపనతో వేడుకలు ముగిశాయి.


