కలిసి పనిచేద్దాం..!
– పరస్పర సహకారంతో ప్రాంతాల అభివృద్ధి
– కర్ణాటక మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్‌తో డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి భేటీ
– గత అనుభవాలు మరోసారి నెమరు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం గతంలో చేపట్టిన కార్యక్రమాలను గుర్తుచేసుకుంటూ తెలంగాణ శాసనమండలి ప్రభుత్వ చీఫ్‌విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి, కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్ భవిష్యత్తులోనూ పరస్పర సహకారంతో పనిచేయాలని ఆకాంక్షించారు.

కర్ణాటకలోని కలబురిగి జిల్లా ఘన్గాపూర్ పర్యటనకు వెళ్లిన డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి, మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్‌ను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు నేతలు ఆప్యాయంగా పలకరించుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

గతంలో ఇరువురూ తమ రాష్ట్రాల్లో రవాణా శాఖ మంత్రులుగా పనిచేసిన సమయంలో సేడం, తాండూరు నియోజకవర్గాల్లో బస్సు సౌకర్యాల మెరుగుదల, రహదారుల నిర్మాణం, కాగ్నా నది నీటి వినియోగం, రైతు సంక్షేమం తదితర అంశాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేసుకున్నారు.

భవిష్యత్తులోనూ ప్రజా సంక్షేమం, ప్రాంతాల అభివృద్ధి కోసం పరస్పర సహకారంతో కృషి చేయాలని చర్చించారు. ఈ భేటీలో టీపీసీసీ ప్రచార కమిటీ సమన్వయకర్త కరణం పురుషోత్తంరావు, బిర్కట్ రఘు, బీదర్ రాజశేఖర్, రవికుమార్ తదితరులున్నారు.


