మనిషిని మింగిన ఇసుక గుంతలు…!
– స్నానానికి వెళ్లిన వ్యక్తి నీటిలో మునిగి మృతి
– భర్త మృతితో అనాథలైన భార్య, ముగ్గురు పిల్లలు
– యాలాల విశ్వనాథ్‌పూర్ గ్రామంలో విషాదం
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇసుక తవ్వకాలతో ఏర్పడిన భారీ గుంతలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. స్నానం చేసేందుకు కాగ్నా వాగుకు వెళ్లిన వ్యక్తి నీటిలో కనిపించని లోతైన గుంతలో పడి మృత్యువాత పడ్డాడు.

ఈ విషాద ఘటన యాలాల మండలం విశ్వనాథ్‌పూర్ గ్రామ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మోత్కూరు కిష్టప్ప (40), తండ్రి అయ్యప్ప, మంగళవారం స్నానం చేసేందుకు కాగ్నా వాగుకు వెళ్లాడు. గత కొన్ని నెలలుగా అభివృద్ధి పనుల పేరుతో భారీ యంత్రాల ద్వారా వాగులో ఇసుక తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఈ క్రమంలో హిటాచీలతో తవ్వకాలు జరపడంతో వాగులో పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వాటిలో నీరు చేరడంతో గుంతల లోతు బయటకు కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలియని కిష్టప్ప నీటిలోకి దిగడంతో లోతైన గుంతలో పడి ప్రాణాలు కోల్పోయాడు. కిష్టప్ప మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఆయనకు భార్య ఎల్లమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తి మృతితో భార్యాపిల్లలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు. వాగులో ఇసుక తవ్వకాల కారణంగా ఏర్పడిన ప్రమాదకర గుంతలపై అధికారులు దృష్టి సారించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.


