ఒక్కరే ఉంటే బీమా రాదు..!
– ఇద్దరు ఉన్నా ఇబ్బందులే
– ఇందిరమ్మ బీమాకు కొర్రీలు..
– అర్హులైనా అందని భరోసా
తాండూరు, దర్శిని ప్రతినిధి: పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి నిబంధనల చిక్కులు అడ్డంకిగా మారుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రేషన్ కార్డులో ఒక్కరే ఉన్నా బీమా దరఖాస్తుకు ఇబ్బందులు ఎదురవుతుండగా, ఇద్దరు సభ్యులున్న కార్డుదారులకూ నామినీ వివరాల నమోదులో సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొత్త రేషన్ కార్డుల మంజూరుతో ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడిన వారికి ప్రత్యేక కార్డులు వచ్చాయి. కొత్తగా వివాహమైన దంపతులకు సైతం వేర్వేరు కార్డులు మంజూరయ్యాయి. దీంతో కొన్ని కార్డుల్లో ఒక్కరి పేరు మాత్రమే నమోదైంది.

కుటుంబంలో తల్లి లేదా తండ్రి ఒక్కరే ఉన్న సందర్భాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బీమా కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళ్తున్న వారికి సభ్యుల సంఖ్య, నామినీ వివరాల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని బాధితులు చెబుతున్నారు. కొడుకు లేదా ఇతర కుటుంబ సభ్యులకు వేరే రేషన్ కార్డు ఉన్నప్పటికీ నామినీగా నమోదు చేసుకునే అవకాశం లేదని అధికారులు చెబుతున్నట్లు పలువురు వాపోతున్నారు.

ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులున్న కార్డులకే దరఖాస్తులు స్వీకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో బీమా పొందాలన్న ఆశతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న అర్హులు నిరాశకు గురవుతున్నారు. కుటుంబంలో సభ్యుల సంఖ్య తక్కువగా ఉంటే ఆర్థిక భరోసా అవసరం లేదా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

పథకం ఉద్దేశం అర్హులైన కుటుంబాలకు భద్రత కల్పించడమే అయినప్పుడు నిబంధనల కారణంగా ఎవరూ నష్టపోకూడదని ప్రజలు కోరుతున్నారు. ఒంటరి సభ్యులున్న రేషన్ కార్డుదారులతో పాటు నామినీ సమస్యలు ఎదుర్కొంటున్న వారికీ అవకాశం కల్పించేలా నిబంధనలను సరళీకరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.

