ఖరీఫ్ ధాన్యం కొంటాం..!
– తెలంగాణ లేఖకు స్పందించిన కేంద్రం
– అదనంగా 6 లక్షల టన్నుల కొనుగోలుకు హామి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెంలగాణ రాష్ట్ర, భారత కేంద్ర ప్రభుత్వాలు ధాన్యం రైతులకు శుభవార్తను చెప్పాయి. ఖరీప్ సీజన్లో అదనంగా మరో 6 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్రం సానుకూలత ప్రకటించింది.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య వివాదం కొనసాగుతోంది. ఈ ఏడాది ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై లిఖితపూర్వక హామీ కోసం ప్రయత్నించింది. దీనిపై తాడో పేడో తేల్చుకునేందుకు తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లింది.
ఖరీఫ్ సీజన్లో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కంటే అధికంగా సేకరిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. ఆ మాటలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని తెలంగాణ మంత్రులు పట్టుబట్టారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కోసం 20.9.2021న రాసిన లేఖపై కేంద్రం స్పందించి.. బియ్యం సేకరణ టార్గెట్ పెంచేందుకు ఆమోదం తెలిపినట్టు లేఖలో పేర్కొంది కేంద్ర సర్కార్. ఖరీఫ్‌కు సంబంధించి తెలంగాణలో పూర్తి ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలో ఖరీఫ్ సీజన్లో బియ్యం సేకరణ లక్ష్యం పెంచినట్టు వెల్లడించింది.
ఈ మేరకు కేంద్రం నుంచి తెలంగాణ పౌర సరఫరాల కమిషనర్‌కు లేఖ రాసింది మోడీ సర్కార్. మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఆహారశాఖ లేఖ ద్వారా సమాచారం అందించింది. అంటే.. 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తీసుకోనుందని కేంద్రం వెల్లడించింది. కేంద్రం నుంచి స్పష్టమైన నిర్ణయం రావడంతో తెలంగాణ ప్రభుత్వం 68.65 లక్షల టన్నుల వరిధన్యాన్ని సేకరించేందుకు సిద్దమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు.. ప్రకటనలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

