రైల్వే ప్ర‌యాణికుల‌పై ఫ్లాట్ ఫాం ధ‌ర‌ల పిడుగు

తాండూరు తెలంగాణ వికారాబాద్ హైదరాబాద్

రైల్వే ప్ర‌యాణికుల‌పై ఫ్లాట్ ఫాం ధ‌ర‌ల పిడుగు
– భారీగా ధ‌ర‌ల‌ను పెంచిన రైల్వే శాఖ
– క‌రోనా వేళ ర‌ద్దీని త‌గ్గించేందుకు నిర్ణ‌యం
ద‌ర్శిని డెస్క్ : రైల్వే ప్ర‌యాణికుల‌పై ద‌క్షిణ మ‌ద్య రైల్వే శాఖ పిడుగు లాంటి వార్త‌ను వేసింది. రైల్వే స్టేష‌న్ల‌కు వెళ్లే ప్ర‌యాణికుల ఫ్లాట్ ఫాం ధ‌ర‌ల‌ను భారీగా పెంచి షాక్ ఇచ్చింది. గ‌తంలో రూ. 10 లు ఉన్న ఫ్లాట్ ఫాం ధ‌ర‌ల‌ను ఏకంగా రూ. 20ల‌కు పెంచింది. సంక్రాంతి పండగ నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో పాటు వారి బంధువులు కూడా పెద్ద సంఖ్యలో స్టేషన్లకు రావ‌డంతో రైల్వే స్టేష‌న్ ల‌లో ర‌ద్దీ ఎక్కువగా ఏర్ప‌డుతోంది. దీంతో రైల్వే స్టేషన్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. క‌రోనా, ఓమిక్రాన్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని రైల్వేస్టేష‌న్ల‌లో రద్దీని తగ్గించే ప్రయత్నంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ప్లాట్‌ఫాం టికెట్‌ ధరలను భారీగా పెంచాల‌ని నిర్ణ‌యించింది. ద‌క్షిణ‌మ‌ద్య రైల్వే శాఖ ప‌రిధిలోని కేవ‌లం సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ కాకుండా నాంపల్లి, కాచిగూడ, వరంగల్‌, ఖమ్మం, లింగంపల్లి, కాజీపేట్‌, మహబూబ్‌నగర్‌, రామగుండం, మంచిర్యాల, భద్రాచలం, వికారాబాద్‌, తాండూర్, బీదర్‌, బేగంపేట తదితర స్టేషన్ల ప్లాట్‌ఫాం టికెట్ల ధరలను రూ. 10 నుంచి రూ. 20 వ‌ర‌కు పెంచారు. పెంచిన ప్లాట్ ఫాం ధ‌రలు నేటి నుంచే అమ‌లులో ఉంటాయ‌ని తెలిపారు. ఈ నెల 20 వ‌ర‌కు ఈ ధరలు ఉంటాయ‌ని రైల్వే అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే తాజా నిర్ణ‌యంతో సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ లో ప్లాట్ ఫాం టికెట్ ధ‌ర రూ. 50 అయింది. గ‌తంలో ప్లాట్ ఫాం టికెట్‌ ధ‌ర కేవ‌లం రూ. 10 మాత్రమే ఉండేది.