గ్రామీణ రోడ్లకు రాజయోగం..!
– చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో మూడు రోడ్లుకు నిధులు
– సీఆర్ఐఎఫ్ కింద రూ. 32 కోట్లు
– ఫలించిన ఎంపీ రంజిత్ రెడ్డి కృషి
తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల పార్లమెంట్ పరిధిలోని మూడు రోడ్లకు రాజయోగం వరించింది. కేంద్ర ప్రభుత్వం సీఆర్ఐఎఫ్(సెంట్రల్ రోడ్డు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) కింద రూ.32 కోట్లు మంజూరు చేసింది. గత కొన్ని రోజుల నుంచి చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి చేస్తున్న కృషి ఫిలించింది. సీఆర్ఐఎఫ్ కింద మంజూరు చేస్తున్న నిధులకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ అవుతాయని ఎంపీ రంజిత్ రెడ్డి ప్రకటించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీకి వెళ్ళిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి తన పార్లమెంట్ పరిధిలోని రోడ్ల విషయమై, అలాగే కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్ లో వున్న పలు అంశాలపై అక్కడి అధికారులతో ముమ్మరంగా సంప్రదింపులు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు వికారాబాద్, కోడంగల్, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో దాదాపు 25.6 కి.మిల మూడు రోడ్లను సీఆర్ఐఎఫ్ కింద అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. తాండూరు నియోజకవర్గ పరిధిలోని తాండూరు నుంచి ధారూర్ వరకు 9 కిలోమీటర్లు(కిలోమీటరు రాయి 9 నుంచి 18 వరకు), కోడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్ పేట్ మండలం తుంకిమెట్ల నుంచి నారాయణపేట్ రోడ్డు మార్గంను రెండు కిలోమీటర్లు(కిలోమీటరు రాయి 0 నుంచి 2 వరకు) విస్తరించి అభివృద్ధి చేసేందుకు సిఆర్ఐఎఫ్ కింద నిధులు మంజూరు అవుతాయని ఎంపీ తెలిపారు. ఈ రెండు రోడ్డు మార్గాలలో మొత్తం 11 కిలోమీటర్ల రోడ్డు మార్గంను విస్తరించి అభివృద్ధి చేసేందుకు రూ.17 కోట్లు వస్తాయన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని శంషాబాద్ నుంచి కొల్లపడకల రోడ్డును కిలోమీటరు రాయి 7 నుంచి 22 వరకు మొత్తం 14 కిలోమీటర్లు విస్తరించి అభివృద్ధి చేసేందుకు రూ.15 కోట్లు మంజూరుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.

