మేడారం భక్తుల మొక్కులకు ఆర్టీసీ సేవలు
– కార్గో ద్వారా అమ్మవారి చెంతకు బెల్లం పార్శిల్
– తిరిగి భక్తుల వద్దకు అమ్మవారి ప్రసాదం
తాండూరు, దర్శిని ప్రతినిధి: మేడారం భక్తుల మొక్కుల చెల్లింపు కోసం ఆర్టీసీ సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. మేడారం వెళ్లలేకపోయిన వారు.. అమ్మవారికి మొక్కులకు చెల్లించేందుకు అవకాశం కల్పించేందుకు వీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ప్రవేశ పెట్టిన కార్గో సేవలను మేడారం జాతర ఉత్సవాలకు వినియోగించుకుంటున్నారు. దేవాదాయ శాఖ సహాకారంతో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు తాండూరు ఆర్టీసీ డీపో మేనేజర్ పవిత్ర తెలిపారు. జాతరకు వెళ్లలేని భక్దుల వద్ద నుంచి అమ్మవారికి సమర్పించే బంగారం(బెల్లం) పార్శిల్ ద్వారా పంపిస్తే.. అక్కడ ఆ మొక్కులను అమ్మవారికి చెల్లించేలా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం కింద భక్తులు.. ఎవరైతే అమ్మవారికి బంగారం చెల్లించాలనుకుంటారో వారు నేరుగా ఆర్టీసీ బస్స్టాండ్లలోని పార్శిల్ కౌంటర్లను సంప్రదించాల్సి ఉంటుంది. అలా బంగారం ను మేడారం సమ్మక్క సారలమ్మకు పంపించవచ్చు. 5 కేజీల వరకు బంగారం(బెల్లం) అమ్మవారి చెంతకు చేరుస్తారు. బుకింగ్ పాయింట్ నుంచి మేడారానికి ప్రసాదం తీసుకెళ్లడానికి ఛార్జీలు ఇలా ఉన్నాయి. 200 కిలోమీటర్ల వరకు రూ.400. ఆపైన కిలోమీటర్లకు రూ.450 చొప్పున ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. మరోవైపు అమ్మవారి చెంతకు బెల్లం చేర్చిన తరువాత జాతర ముగిసిన అనంతరం 200 గ్రాముల ప్రసాదంతో పాటు అమ్మవారి పసుపు, కుంకుమ, ఫోటోను తిరిగి భక్తులకు అందజేసే చర్యలను చేపడుతున్నారు. ఇందుకోసం అదే బుకింగ్ కౌంటర్ వద్దకు భక్తులు వెళ్లవలసి ఉంటుంది. తాండూరు ప్రాంతంలోని భక్తులు తాండూరు ఆర్టీసీ కార్గో సెంటర్ సెల్ 8247779187ను సంప్రదించవచ్చు. ఇతర వివరాల కోసం కాల్ సెంటర్ నెంబర్: 040-30102829, 040-68153333 తో పాటు http://www.tsrtc.telangana.gov.in ను కూడ సంప్రదించవచ్చు.

